రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మేడ్చల్:
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలౖయెన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వీరయ్య(29) మేడ్చల్ పట్టణంలోని బాలాజీనగర్‌లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మండలంలోని పూడూర్‌కు నివాసి మణికుమార్(19)తో కలిసి గ్రామ పరిధిలోని డైమండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురును పండుగ కోసం తీసుకెళ్లేందుకు వీరయ్య మామ వచ్చాడు. దీంతో వీరయ్య, తన మిత్రుడు మణికుమార్ సాయం తీసుకొని రెండు బైకులపై తన భార్యతో పాటు మామను నగరంలోని ఎల్‌బీనగర్‌లో వదిలిపెట్టి తిరిగి సోమవారం రాత్రి వీరయ్య ఇంటికి చేరుకున్నారు. అనంతరం వీరయ్య బైక్‌ను ఇంటి వద్ద ఉంచి మణికుమార్ బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై చెక్‌పోస్ట్ వద్ద సోమవారం అర్ధరాత్రి దాటాక శామీర్‌పేట్ రోడ్డుకు యూటర్న్ తీసుకుంటుండగా నగరం వైపు వేగంగా వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను వెనుకనుంచి ఢీకొంది. దీంతో బైక్ వెనుక కూర్చున్న వీరయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వాహనం నడుపుతున్న మణికుమార్ తలకు తీవ్రగాయాలవగా ఆయనను నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మంగళవారం వీరయ్య మతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్వస్థలానికి తీసుకెళ్లారు.