మరణించిన సాయి
డెంగీతో యువకుడి కన్నుమూత
Published Thu, Oct 6 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
జ్వరాలతో వణుకుతున్న జగన్నాథపురం
కన్నెత్తి చూడని అధికారులు, పాలకులు
పార్వతీపురం : పది రోజులుగా డెంగీతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పట్టణంలోని జగన్నాథపురం ఒకటో వార్డు కష్ణా కాలనీకి చెందిన 19 ఏళ్ల చుక్క సాయి గురువారం కన్నుమూశాడు. జ్వరం రాగానే సాయిని కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు సాయిని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే కుటుంబ సభ్యులు విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సాయి కోమాలోకి చేరుకోవడంతో తిరుమల ఆస్పత్రి వైద్యులు కూడా విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే..
జగన్నాథపురంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు, మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు విజంభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం 1,29,30 వార్డుల్లోని ప్రతి వీధిలోనూ జ్వరపీడితులున్నారు. జ్వరాలతో ప్రాణాలు పోతున్నా మున్సిపల్ పాలకులు, అధికారులు, వైద్యసిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జగన్నాథపురంలో వైద్యశిబిరం నిర్వహించాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement