సాక్షి, పాలకొండ: ప్రజా సేవకై అలుపెరగకుండా, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటూ పాలకొండ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 21న దోనుబాయిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె అస్వస్థత గురయ్యారు.
కాగా, గత నాలుగు రోజులుగా స్వగ్రామం వండవలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కళావతి బుధవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సామాన్య ప్రజలలాగే ఆమె ఏరియా ఆసుపత్రిలో చేరారు. దీంతో సూపరింటెండెంట్ జి. నాగభూషణరావు, ఆర్.ఎం జె.రవీంద్రకుమార్.. ఎమ్మెల్యే కళావతికి వైద్య చికిత్సలు అందజేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వైద్య చికిత్సలు పొందిన ఎమ్మెల్యే కళావతి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం, నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, ఏరియా ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఎమ్మెల్యే కళావతి సంతృప్తి వ్యక్తం చేశారు.
అలుపెరగని ప్రజాసేవ..
పాలకొండ ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల పట్ల ఆమెకున్న దీక్షా దక్షతను చూసి 2019లో మరో మారు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అఖండ విజయం కట్టబెట్టారు. ప్రతి పక్షం నుండి అధికార పక్షంలో అడుగుపెట్టిన కళావతికి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే పనిగా మారింది. దీంతో 2019లో అధికారం వచ్చిన తర్వాత నుండి ప్రజా సేవలోనే మమేకమవుతూ వస్తున్నారు.
నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా తెలుసుకునేందుకు ముందుకు సాగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 21వ తేదీ వరకు నియోజకవర్గంలో 32 పంచాయతీల్లో 82 రోజుల పాటు అవిశ్రాంతంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రజల సుఖాలు తెలుసుకుంటూ వారికి బాసటగా నిలిచారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 21న దోనుబాయిలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో, తమ అభిమాన ఎమ్మెల్యే కళావతి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment