బోరు నిర్మిస్తూ యువకుడి మృతి
-
మరొకరికి గాయాలు
కావలిరూరల్ : పొలంలో బోరువేస్తూ విద్యుత్ షాకుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందలకు చెందిన దద్దాల పిచ్చయ్య గౌడ్ మామిడితోటలో బోరు వేస్తున్నారు. బోరు నిర్మాణ పనులను ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ జిల్లా రాయగఢ్‌కు చెందిన వికాస్ (29), ఒబ్బిగోండ్ అనే కూలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులు పైకి లాగుతుండగా పైన ఉన్న కరెంటు తీగలు పైపునకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వీరిలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒబ్బిగోండ్ గాయపడటంతో అతన్ని 108లో కావలికి తరలించి ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు వికాస్ అవివాహితుడు. వికాస్ తండ్రి ఇటీవలే మరణించగా అతను ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. అతని తల్లిదండ్రులకు నలుగురు సంతానం కాగా వికాస్ చివరివాడు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.