అన్నను చంపిన తమ్ముడి అరెస్టు
Published Sat, Aug 27 2016 11:12 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
జగిత్యాల రూరల్ : ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడిని జగిత్యాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గుల్లపేటకు చెందిన భూపతి ఎల్లయ్య, బుచ్చవ్వలకు ముగ్గురు కొడుకులు. వీరికి 8.30 ఎకరాల భూమి ఉంది. రెండో కుమారుడు లచ్చన్న మతమార్పిడి అయ్యాడు. ఆగ్రహానికి గురైన ఎల్లయ్య మిగిలిన కుమారులు భూపతి రామన్న, భూపతి లింగన్న పేరిట ఏడెకరాలు పట్టా చేయించారు. అప్పటి నుంచి వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయితీ నిర్వహించగా.. ఉపాధి కోసం బెహరాన్ వెళ్లిన లింగన్న స్వగ్రామానికి వచ్చాడు. ఈనెల 10న పంచాయితీ జరుగుతుండగానే.. లింగన్న లచ్చన్నపై కట్టెతో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చన్నను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతుండగానే లింగన్న తిరిగి బెహరాన్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో లచ్చన్న (45) ఈనెల 24న చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన లింగన్నను రప్పించేందుకు పోలీసులు ఆయన కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడితెచ్చారు. దీంతో ఆయన శుక్రవారం బెహరాన్ నుంచి స్వదేశానికి రాగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Advertisement