ఉల్లికిపాట్లు!
– జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం
– ఇప్పుడిప్పుడే వస్తున్న దిగుబడులు
– పూర్తిగా పడిపోయిన ధరలు
– రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.15
– వ్యవసాయ మార్కెట్‌లో
లభిస్తున్నది రూ.2 మాత్రమే
– లబోదిబోమంటున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఈ పంటను పండిస్తున్న రైతులకు మాత్రం ఎలాంటి మేలు కలగడం లేదు. మార్కెట్‌లో ధర లేక..కొనేవారు సైతం లేక అన్నదాత అవస్థలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలో ఉల్లి పండించే జిల్లాలో కర్నూలు అగ్రస్థానంలో ఉంది. జిల్లాలో సాధరణ సాగు 19,147 హెక్టార్లు . అయితే ఈ ఏడాది 20,746 హెక్టార్లలో సాగైంది. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట సాగు ఎక్కువగా ఉంది. దీంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. పైగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో బస్తాల్లోనే ఉల్లి కొనుగోలు చేసే పద్ధతి ఉండడంతో తాడేపల్లిగూడెంకు కాకుండా రైతులు ఉత్పత్తులను ఇక్కడికే తీసుకొస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ఉల్లి నిల్వలు పేరుకపోతున్నాయి.
కొనుగోలు చేసేవారేరీ?
మార్కెట్‌లో నాలుగైదు రోజులు ఉన్నా.. ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా క్వింటాలుMýు లభిస్తున్నధర రూ.150 నుంచి రూ.300 వరకే ఉంటోంది. తెచ్చిన ఉల్లిని అమ్ముకోవాలంటే ఐదు రోజుల సమయం పడుతోంది. దీంతో రైతులపై ఖర్చుల మోత పెరుగుతోంది. మార్కెట్‌లో ఉల్లి నిల్వలు పేరుకపోవడంతో ఆదివారం కూడా ఉల్లిని కొనుగోళ్లు చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే హమాలీలు సహకరించలేదు. ధర తగ్గడంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సరకుపేరుకపోయినా అలస్యంగా వేలంపాట ప్రారంభించడం, ముందుగానే ముగిస్తుండటం రైతులకు శాపంగా మారుతోంది. బుధ,గురువారాల్లో వచ్చిన ఉల్లిని కూడా ఇంతవరకు కొనుగోలు చేయలేదంటే వేలంపాట ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.
మార్కెట్ మాయాజాలం..
మార్కెట్‌లో క్వింటాలు ఉల్లికి సగటున లభిస్తున్న ధర కేవలం రూ.150 నుంచి రూ.300 మాత్రమే. కాని రీటైల్‌గా కిలో ధర రూ.15 ఉంది. కర్నూలు సి. క్యాంపు రైతుబజార్ బయట మామూలు ఉల్లినే కిలో రూ.10, ఒకమోస్తరు నాణ్యత కలిగిన ఉల్లిని రూ16 ప్రకారం విక్రయిస్తున్నారు. అదే నాణ్యత ఉన్న ఉల్లిని మాత్రం వ్యాపారులు కిలో రూ. 1.50 నుంచి రూ.3 లెక్కన కొంటున్నారు. రైతులు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధరలు పడిపోయాయని విమర్శిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడుల్లో 30 శాతం కూడా రావడం లేదంటున్నారు.