అంతా ఆన్‌లైనే..!
ఇక పోటీ పరీక్షలన్నీ ఈ విధానంలోనే
ఎంసెట్– 2017 ఆన్‌లైన్‌కు సన్నాహాలు
యువతకు అవగాహన అవసరం అంటున్న నిపుణులు
బాలాజీచెరువు (కాకినాడ) : కాలం మారింది. దానికి అనుగుణంగా విద్యారంగం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటోంది. గతంలో మాదిరిగా పోటీ పరీక్షలనే సరికి పెన్ను, పెన్సిల్, అట్ట, ఎరేజర్, హాల్ టికెట్ పట్టుకుని పరీక్ష కేంద్రాలకు ఉరుకులు, పరుగులు పెట్టే రోజులు పోయాయి. ఇక మీదట ఈ కష్టాలన్నింటికి చెక్ పడనుంది. భవిష్యత్‌లో అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో రాసేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండగా రానున్న రోజుల్లో మిగిలినవన్నీ ఆ విధానంలో కొనసాగనున్నాయి. అందుకే గ్రామీణ విద్యార్థులు, నిరుద్యోగ యువత నూతన సాంకేతిక విధానలపై అవగాహన పెంపొందించుకోవలసిన అవసరం ఉంది.
అంతా ఇంటర్‌నెట్ ద్వారానే
వచ్చే సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, వ్యవసాయం, వైద్య విద్య, ఇతర వృత్తి విద్య ప్రవేశ రాత పరీక్షలన్నీఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐటీ, ఇతర సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, మెయిన్ పరీక్ష ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లో, వైద్య విద్యకోసం వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించే నీట్ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందు నుంచే సాంకేతికతపై పట్టు సాధిస్తే ఆన్‌లైన్ పరీక్షను సునాయాసంగా ఎదుర్కోవచ్చు.
జాతీయ స్థాయిలో అన్నీ ఆఆన్‌లైన్‌లోనే
జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే బోర్డు ఈ సంవత్సరం ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అభ్యర్థుల్లో అవగాహన పెంచింది. దీనిపై అవగాహన ఉంటే ఆన్‌లైన్ పరీక్ష విధానం ఎంతో సులువు. లేకుంటే అంతా గందరగోళంగా ఉంటుంది.
అనుకూల సమయంలో పరీక్షలు
ఆన్‌లైన్ పరీక్షల వల్ల ప్రశ్నపత్రాల లీకేయ్యే ఆస్కారం ఉండదు. ప్రశ్నపత్రాల ముద్రణ, కేంద్రాలకు పంపిణీ ఖర్చులు తగ్గుతాయి. అభ్యర్థులకు అనుకూలంగా ఉన్న సమయంలో పరీక్ష రాయవచ్చు. పరీక్షలు శ్లాట్‌బుకింగ్ ద్వారా రాయడం వల్ల మూల్యాంకనం త్వరగా చేయవచ్చు.