
దెబ్బకు దెయ్యం దిగాల్సిందే
►దుమారం రేపిన ‘దెయ్యాల కొంప’ వ్యాఖ్యలు
►టీడీపీ ఎమ్మెల్సీ మూర్తిపై సర్వత్రా ఆగ్రహం
►ఏయూ మెయిన్ గేట్ వద్ద ధర్నా, దిష్టిబొమ్మ దహనం
►సొంత వర్సిటీ ‘గీతం’ను ప్రమోట్ చేసుకునేందుకే ఈ కుత్సితమని విమర్శలు
►24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
‘చదువుల తల్లి కొలువైన దేవాలయం.. దెయ్యాల కొంపగా కనిపించిందంటే.. ఆ వ్యక్తికే దెయ్యం పట్టిందనుకోవాలి.. ఆ దెయ్యం దిగిపోవాలి.. 24 గంటల్లో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి’.. విశ్వవిఖ్యాత ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ను దెయ్యాల కొంపతో పోల్చిన టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిపై ఆగ్రహంతో రగిలిపోతూ విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, అధ్యాపకేతరులు, చివరికి సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. డిమాండ్లు ఇవి.. ఎందరో మహామహులను దేశానికి అందించిన.. చివరికి డాక్టరేట్‌తో తనను కూడా గౌరవించిన విషయాన్ని విస్మరించి.. తన యాజమాన్యంలోని గీతం వర్సిటీని ప్రమోట్ చేసుకోవాలన్న స్వార్థ వ్యాపార లక్ష్యంతో దైవం లాంటి ఏయూను దెయ్యం చేసేశారని అన్ని వర్గాలు దుమ్మెత్తిపోశాయి.
మూర్తి వ్యాఖ్యలపై నిరసనలతో ఏయూ భగ్గుమంది.. విద్యార్థి సంఘాలు, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు.. వారి ఆగ్రహాగ్నిలో మూర్తి దిష్టిబొమ్మ దహనమైంది. మరోవైపు ఏయూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సంఘాలు సమావేశమై ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. లేకపోవతే ఎమ్మెల్సీ మూర్తిని విశాఖలో తిరగనివ్వబోమని హెచ్చరించాయి.