పోలీసు బందోబస్తు మధ్య శ్రీమఠంలో ప్రదక్షిణలు చేస్తున్న ఆనంద్‌గురూజీ
చుట్టూ పోలీసుల మధ్య కాషాయ వస్త్రధారణలో ఉన్న ఈయన పేరు డా.బ్రహ్మర్షి ఆనంద్ గురూజీ. రాఘవేంద్రస్వామి దర్శనార్థం శనివారం మంత్రాలయం మఠం వచ్చారు.
– మంత్రాలయం పోలీసుల అత్యుత్సాహం
– ఆధ్యాత్మిక గురువుకు ప్రొటోకాల్ బందోబస్తు
మంత్రాలయం : చుట్టూ పోలీసుల మధ్య కాషాయ వస్త్రధారణలో ఉన్న ఈయన పేరు డా.బ్రహ్మర్షి ఆనంద్ గురూజీ. రాఘవేంద్రస్వామి దర్శనార్థం శనివారం మంత్రాలయం మఠం వచ్చారు. కన్నడ చానెల్‌లో గ్రహ ఫలాలు చెప్పడంతోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలిచ్చే సాధారణ గురువైన ఈయన బెంగళూరులో ఆనంద్ సిద్ది పీఠం వ్యవస్థాపకులు. సాధారణంగా ఎంతోమంది పెద్దపెద్ద పీఠాధిపతులు వచ్చినా ఏనాడు పోలీసులు అటువైపు రాలేదు. కనీసం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వచ్చినా కూడా ప్రొటోకాల్ పాటించని సందర్భాలు కోకొల్లలు. అలాంటి రాజకీయ ప్రముఖుడు కాదు.. నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు.. శత్రుసైన్యాల నుంచి ఆపద ఉన్న వ్యక్తి కూడా కాదు. అలాంటి ఓ ఆధ్యాత్మిక గురువుకు ఇక్కడి పోలీసులు బందోబస్తు సపర్యలు చేశారు. ముందుగా ఎస్‌ఐ మునిస్వామి జీపు సైరన్ కొడుతూ మధ్య కారులో ఆనంద్‌గురూజీ, వెనక సీఐ నాగేశ్వరావు జీపు. ఎవరో వీవీఐపీ వచ్చారని అందరూ సైలెంట్ అయ్యారు. తీరా చూస్తే ఓ సాధారణ ఆధ్యాత్మిక గురువు. సాయంత్రం 4 గంటల వరకు సీఐ, ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు ఆయనకు రక్షకవలయంలా ఉండిపోయారు. అనంతరం ఆయన మంత్రాలయం నుంచి విశ్రమించగా పొలిమేర వరకు ఎస్‌ఐ జీపు ముందుగా సైరన్ కొడుతూ వీడ్కోలు పలికారు. కేసుల పని మానేసి పోలీసులు ఇలా అత్యుత్సాహం చూపించారు. భక్తులు సైతం ఎవరీయన, ఎందుకు ఇంత బందోబస్తు అంటూ ముక్కున వేలేసుకున్నారు. తీరా ఆయన గురించి తెలుసుకున్న జనం రెగ్యులర్ డ్యూటీలు పక్కనపెట్టి కాషాయం చుట్టూ కాపలా కాసిన పోలీసుల తీరు చూసి నవ్వుకున్నారు.