నేతల జేబులు నింపుకొనేందుకే ప్యాకేజీ
సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్
కృష్ణలంక : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎంపీలు తమ జేబులు నింపుకొనేందుకే ప్యాకేజీల పాట పాడుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై సీపీఐ ఆధ్వర్యాన కృష్ణలంక చలసానినగర్ సిద్దెం కృష్ణారెడ్డి భవన్ వద్ద గురువారం ప్రజాబ్యాలెట్ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నాసర్‌వలీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్య నాయుడు, 15 ఏళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పడు హోదా అవసరం లేదని కల్లబొల్లి మాటలు చెప్పడం వారి ఊసరవెల్లి రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీపీఐ నగర కార్యకవర్గ సభ్యులు సంగుల పేరయ్య, బొక్క ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ రాయ రంగమ్య తదితరులు పాల్గొన్నారు.
గుణదలలో...
గుణదల : సీపీఐ నగర సమతి చేపట్టిన ప్రజా బ్యాలెట్ కార్యక్రమం గురువారం గుణదల సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. ప్రత్యేక హోదా వల్లే సాధ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు ఎల్.దుర్గారావు, 2వ డివిజన్ కార్యదర్శి ఆనందరావు, నాలుగో డివిజన్ కార్యదర్శి ఎన్‌వీ రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.