
ఏపీలో 16 లక్షల హెక్టార్లలో వరి సాగు
శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ, వరి వంగడాలు, పరిశీలన
గుడ్లవల్లేరు : ఏపీలో 16 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోందని నెల్లూరు వరి విత్తన పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన గుడ్లవల్లేరు, పెంజెండ్ర, చిత్రంలో వల్లభనేని నరసింహారావు, జూపూడి పూర్ణచంద్రరావు సాగు చేసిన (4001, 3513 రకాల నూతన వరి వంగడాలు) చేలను పరిశీలించారు. ఏపీలో దాళ్వా కింద ఎనిమిది లక్షల హెక్టార్లలో వరి సాగు కానుందని చెప్పారు. తమ పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన 4001, 3513 నూతన వరి రకాలను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగు చేశారని, సానుకూల ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. తక్కువ ఎరువుల ఖర్చు, తొలకరికి అనువు, గాలులకు పడిపోవు, చీడపీడలు తట్టుకోవటం, దోమ సోకని రకాలుగా రైతులు చెబుతున్నారన్నారు. రైతులు స్వీయ విత్తనాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలు, దళారులపై ఆధారపడటాన్ని వ్యతిరేకించారు.
అవి షుగర్ లెస్సేనా?
షుగర్ లెస్ విత్తనాలుగా తెలంగాణ నుంచి దిగుమతి అవుతున్న వరి విత్తనాలపై స్థానిక రైతులు మండిపడ్డారు. ఏ బియ్యంలో అయినా కార్బోహైడ్రేడ్స్ ఉండవా? అని శాస్త్రవేత్తలను అడిగారు. దానికి శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కార్యక్రమంలో ఏరువాక కేంద్ర జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ వి.మహేశ్వరప్రసాద్, రైతులు వల్లభనేని నరసింహారావు, జూపూడి పూర్ణచంద్రరావు, బొర్రా నాగేశ్వరరావు, రామ నాగేశ్వరరావు, వెంకట్రామయ్య, ఏసు, కృపానందం పాల్గొన్నారు.