పాకిస్తాన్‌ ఖైదీ విడుదల.. మళ్లీ జైలుకు | Pakistan prisoner release.. the going back to jail | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ ఖైదీ విడుదల.. మళ్లీ జైలుకు

Published Tue, Aug 16 2016 10:57 PM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM

జైలు నుంచి బయటకు వస్తున్న అర్షద్‌ - Sakshi

జైలు నుంచి బయటకు వస్తున్న అర్షద్‌

  • సిట్‌ పోలీసులు తరలిస్తుండగా వరంగల్‌లోనే ఉంచాలని ప్రభుత్వం జీఓ
  • అర్షద్‌ కళ్లలో రెండు గంటలే ఆనందం
  • పోచమ్మమైదాన్‌ : పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ అర్షద్‌ మంగళవారం వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. అయితే పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్షద్‌ను తిరిగి అదే జైలులో ఉంచాలని లీగల్‌ అఫైర్స్‌ ప్రత్యేక కార్యదర్శి సంతోష్‌ రెడ్డి ప్రత్యేక జీఓ విడుదల చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు అర్షద్‌ను విడుదల చేయగా, ప్రభుత్వ జీఓ మేరకు వరంగల్‌ ఏసీపీ సురేంద్రనాథ్‌ జైలుకు చేరుకుని అర్షద్‌ను జైలు పర్యవేక్షణ అధికారికి అప్పగించారు. అర్షద్‌ కళ్లలో ఆనందం రెండు గంటలకే ఆవిరైపోయింది.
     
    వివరాలిలా ఉన్నాయి.. పాకిస్తాన్‌లోని రహమయారన్‌ జిల్లా ఖన్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ అర్షద్‌ మహమూద్‌ అక్కడే వ్యాపారం చేస్తూ జీవించేవాడు. దొంగతనంగా మన దేశంలోకి చొరబడి ఇక్కడి సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తూ 2004లో అబిడ్స్‌ పోలీసులకు పట్టుబడగా 3,9 ఆఫ్‌ అఫిషియల్‌ సీక్రెట్‌ యాక్ట్, 14 ఆఫ్‌ ఫార్మన్స్‌ యాక్ట్, 120(బి) ఐపీసీ యాక్ట్‌ ప్రకారం ప్రకారం అరెస్ట్‌ చేశారు. 2009 ఏప్రిల్‌ 30న అర్షద్‌కు 14 సంవత్సరాల శిక్ష విధిస్తూ అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తీర్పు చెప్పారు. దీంతో అతడిని చర్లపల్లి జైలులో ఉంచారు. అక్కడ ఇతర ఖైదీలతో గొడవ పడడంతో 2011లో విశాఖపట్నం జైలుకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర విభజన కావడంతో తిరిగి 2014 జూన్‌ 7న వరంగల్‌ జైలుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, జైలు నిబంధనల ప్రకారం మంగళవారం నాటికి అతడి శిక్షా కాలం పూర్తవడంతో విడుదల చేశారు.
     
    రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని పాక్‌ ప్రభుత్వానికి మన అధికారులు సమాచారం అందించినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి అతడిని వరంగల్‌ జైలులోనే ఉంచాలని ప్రత్యేక జీఓ విడుదల చేయడంతో మళ్లీ తీసుకొచ్చారు. విడుదల అయిన తరువాత అర్షద్‌ మాట్లాడుతూ ‘ఐ లైక్‌ ఇండియా.. ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు’ అంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఎస్కార్ట్‌ వాహనం ఎక్కాడు. వరంగల్‌ దాటక ముందే  జీఓ రావడంతో సాయంత్రం 4.30 గంటలకు వరంగల్‌ పోలీసులు జైలు సూపరింటెండెంట్‌ న్యూటన్‌కు తిరిగి అప్పగించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement