Arshad
-
సీఎంని కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, అర్షద్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబిరెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్ టీమ్)లో బేబిరెడ్డి టీమ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన బేబిరెడ్డి తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపించారు. పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ క్రీడాకారుడు షేక్ అర్షద్‌ను అభినందిస్తున్న సీఎం జగన్, పక్కన కోచ్ ఆదిత్య మెహతా జాతీయస్థాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు చెప్పారు. నంద్యాలకు చెందిన షేక్ అర్షద్ ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. అర్షద్ తాను జాతీయస్థాయిలో సాధించిన పతకాలను కూడా సీఎం జగన్‌కు చూపించారు. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎం జగన్‌ని బేబిరెడ్డి, అర్షద్ కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో బేబిరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు శ్రీనివాసులురెడ్డి, వెంకట్రామిరెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా ఉన్నారు. -
నగరంలో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన తరహాలో నగరంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పట్టుకుంది. సిటీలో మత ఘర్షణలు రేపేందుకు వీరు ఓ ప్రార్థన స్థలంపై 3 కిరోసిన్ బాంబులు విసిరారు. అంతకుముందే రెండు ఏటీఎంలకు నిప్పుపెట్టగా, ఆర్టీసీ బస్సు దగ్ధానికి యత్నించారు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలతో ప్రేరణ పొందిన వీరిద్దరూ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా వీరిని పట్టుకున్నారు. ప్రసంగాలతో స్ఫూర్తిపొంది.. రియాసత్‌నగర్‌కు చెందిన అర్షద్, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వసీ స్నేహితులు. ఒకరు చిరువ్యాపారి కాగా, మరొకరు విద్యార్థి. వీరిద్దరు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్లో ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలు చూసేవారు. వాటి ద్వారా స్ఫూర్తి పొంది..తాము ఏదో ఒక సంచలనం సృష్టించాలని ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ఓసారి మిథాని డిపోలో ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడానికి, ఫిబ్రవరి 11న చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రెండు ఏటీఎంలకు నిప్పు పెట్టడానికి యత్నించారు. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరిగిన ఘర్షణల వంటివి హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కుట్రపన్నారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణ సృష్టిస్తేనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పథకం వేశారు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారం నుంచి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మాదన్నపేటలోని ఓ ప్రార్థన స్థలాన్ని టార్గెట్‌గా చేసుకుని, గత నెల 14 రాత్రి అక్కడకు వెళ్లి మూడు కిరోసిన్ బాంబులు విసిరారు. అవి పేలకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుల వాహనం నంబర్ గుర్తించారు. దీని ఆధారంగా ప్రత్యేక టీమ్ సోమవారం రాత్రి అర్షద్, వసీని పట్టుకుంది. వీరి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు అర్షద్.. వసీని ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు. -
పాకిస్తాన్ ఖైదీ విడుదల.. మళ్లీ జైలుకు
సిట్ పోలీసులు తరలిస్తుండగా వరంగల్‌లోనే ఉంచాలని ప్రభుత్వం జీఓ అర్షద్ కళ్లలో రెండు గంటలే ఆనందం పోచమ్మమైదాన్ : పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ అర్షద్ మంగళవారం వరంగల్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. అయితే పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అర్షద్‌ను తిరిగి అదే జైలులో ఉంచాలని లీగల్ అఫైర్స్ ప్రత్యేక కార్యదర్శి సంతోష్ రెడ్డి ప్రత్యేక జీఓ విడుదల చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు అర్షద్‌ను విడుదల చేయగా, ప్రభుత్వ జీఓ మేరకు వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ జైలుకు చేరుకుని అర్షద్‌ను జైలు పర్యవేక్షణ అధికారికి అప్పగించారు. అర్షద్ కళ్లలో ఆనందం రెండు గంటలకే ఆవిరైపోయింది. వివరాలిలా ఉన్నాయి.. పాకిస్తాన్‌లోని రహమయారన్ జిల్లా ఖన్పూర్కు చెందిన మహ్మద్ అర్షద్ మహమూద్ అక్కడే వ్యాపారం చేస్తూ జీవించేవాడు. దొంగతనంగా మన దేశంలోకి చొరబడి ఇక్కడి సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తూ 2004లో అబిడ్స్ పోలీసులకు పట్టుబడగా 3,9 ఆఫ్ అఫిషియల్ సీక్రెట్ యాక్ట్, 14 ఆఫ్ ఫార్మన్స్ యాక్ట్, 120(బి) ఐపీసీ యాక్ట్ ప్రకారం ప్రకారం అరెస్ట్ చేశారు. 2009 ఏప్రిల్ 30న అర్షద్‌కు 14 సంవత్సరాల శిక్ష విధిస్తూ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. దీంతో అతడిని చర్లపల్లి జైలులో ఉంచారు. అక్కడ ఇతర ఖైదీలతో గొడవ పడడంతో 2011లో విశాఖపట్నం జైలుకు తరలించారు. తెలంగాణ రాష్ట్ర విభజన కావడంతో తిరిగి 2014 జూన్ 7న వరంగల్ జైలుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, జైలు నిబంధనల ప్రకారం మంగళవారం నాటికి అతడి శిక్షా కాలం పూర్తవడంతో విడుదల చేశారు. రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి మన అధికారులు సమాచారం అందించినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి అతడిని వరంగల్ జైలులోనే ఉంచాలని ప్రత్యేక జీఓ విడుదల చేయడంతో మళ్లీ తీసుకొచ్చారు. విడుదల అయిన తరువాత అర్షద్ మాట్లాడుతూ ‘ఐ లైక్ ఇండియా.. ఇక్కడి ప్రజలు చాలా మంచి వారు’ అంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఎస్కార్ట్ వాహనం ఎక్కాడు. వరంగల్ దాటక ముందే జీఓ రావడంతో సాయంత్రం 4.30 గంటలకు వరంగల్ పోలీసులు జైలు సూపరింటెండెంట్ న్యూటన్‌కు తిరిగి అప్పగించారు. -
హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి
హెచ్‌సీఏ ఎన్నికల్లో రాజుకున్న వేడి అధ్యక్ష బరిలో వినోద్, అర్షద్ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రారంభమైన ప్రచారం అప్పుడే మొదలైన ప్రలోభాల పర్వం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు గడ్డం వినోద్, అర్షద్ అయూబ్‌ల ప్యానెళ్లు ఎన్నికల సంగ్రామంలో నిలిచాయి. ఈ రెండు ప్యానెళ్ల వారు సమరానికి సై అంటున్నారు. అప్పుడే ప్రచారాన్ని మొదలు పెట్టడమే కాదు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. అంతకుముందు పలువురు సభ్యులు శిబిరాలను మారడంతో ఆయా ప్యానెళ్లను ఉత్కంఠకు గురిచేశాయి. ఓటరు జాబితాలోనూ గందరగోళం నెలకొనడంతో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 2014-16 కాలానికి గాను హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న జరిగే పోలింగ్‌లో గుర్తింపు పొందిన క్లబ్బుల సభ్యులు, అసోసియేషన్ల ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ల్లో అధ్యక్ష పదవి మొదలుకుని కోశాధికారి వరకు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. కార్యవర్గ సభ్యుల పోస్టులు పన్నెండుకు గాను మొత్తం 25 మంది తలపడుతున్నారు. ఆదివారం అభ్యర్థుల తుది జాబితాలు ప్రకటించటంతో ఆ రెండు ప్యానెళ్ల వారు అమీతుమీకి దిగారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు ముందు అర్షద్ శిబిరంలోని వారు వినోద్ వైపు, వినోద్ శిబిరంలోని వారు అర్షద్ శిబిరాల వైపు మారిపోవడంతో చివరి వరకు హైడ్రామా నెలకొంది. ఈ ఎన్నికలకు హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్ దూరంగా ఉన్నారు. శిబిరాలుగా విడిపోయిన క్లబ్బులు.. ఓటు హక్కు కలిగిన క్లబ్బులు రెండు విడిపోయాయి. హెచ్‌సీఏలో బల్క్ క్లబ్బు (ఒక్కరి చేతిలో ఎక్కువ క్లబ్బులు)లకు చెందిన వారు అత్యధికంగా అర్షద్ అయూబ్ ప్యానెల్లో వివిధ పదవులకు పోటీ పడుతుండగా, ప్రభుత్వ రంగ సంస్థలు, స్కూళ్లు, బ్యాంకులు(ఇన్స్టిట్యూషన్స్)తో పాటు స్వతంత్రంగా వ్యవహరిస్తున్న క్లబ్బుల ప్రతినిధులు వినోద్ ప్యానెల్ తరఫున వివిధ పదవుల కోసం బరిలోకి దిగారు. మొత్తం 216 క్లబ్‌లు ఉన్నాయి. ఒక్కో క్లబ్‌కు ఒక ఓటు ఉంటుంది. ఇందులో 55 మంది ఓటర్లు బల్క్‌గా, మరో 55 మంది వివిధ సంస్థలకు చెందిన వారు ఉన్నారు. కాగా మిగిలిన వారంతా వ్యక్తిగతంగా వ్యవహరించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వ్యవహరించే ఓటర్లు ఎటువైపు మొగ్గితే వారు ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. ఆదివారం నుంచి స్వయంగా రంగంలోకి దిగిన ఇరు ప్యానెళ్ల ప్రతినిధులు.. ‘మీకేం కావాలన్నా సమకూరుస్తాం’ అంటూ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో మునిగిపోయారు. ఫతేమైదాన్ క్లబ్ ఓటుపై అభ్యంతరం.. మాజీ మంత్రి వినోద్ శిబిరం నుంచి హెచ్‌సీఏ ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శేష్‌నారాయణ ప్రాతినిధ్యంపై ఫతేమైదాన్ క్లబ్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు కారణాలతో శేష్‌నారాయణ సభ్యత్వాన్ని సస్పెండ్ చేశామని చెబుతున్నారు. ఫతేమైదాన్ క్లబ్ నుంచి ఆయన స్థానంలో మరొకరిని ఓటరుగా అనుమతించాలని ఆ క్లబ్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఓటరు జాబితాలో వింతలెన్నో... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఓటర్ల జాబితాలో ఎన్నో వింతలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో క్రికెట్ కోసం కృషి చేస్తున్న క్లబ్‌లకు ఇప్పటివరకు గుర్తింపు ఇవ్వకుండా కేవలం పదిమంది చేతుల్లోనే నగరంలో మెజారిటీ క్లబ్‌లు చేరిపోయాయన్న ఫిర్యాదులున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగతా ఎనిమిది జిల్లాల నుంచి కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పలు జిల్లాలకు ఓటు హక్కు ఉన్నట్టు ఓటరు జాబితా చూపుతున్నా, వాటి ప్రతినిధులుగా రాజధానికి చెందిన వారే కావడం గమనార్హం. హెచ్‌సీఏ గుర్తింపు పొందిన క్లబ్బులు,అసోసియేషన్లే సెప్టెంబర్ 7న జరిగే ఎన్నికల్లో నూతన కమిటీ (2014-16)ని ఎన్నుకోనున్నాయి. కలకలం రేపిన ఏసీబీ నోటీసులు హెచ్‌సీఏ ఎన్నికలు ఓ వైపు రసవత్తరంగా మారగా మరో వైపు అవినీతి నిరోధక శాఖ సైతం తమ విచారణను ముమ్మరం చేసింది. వారం రోజుల క్రితం హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు అర్షద్ అయూబ్, మాజీ కార్యదర్శి శివలాల్తోపాటు అప్పటి కార్యవర్గంలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణాల్లో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. స్టేడియం నిర్మాణ వ్యయం పెంపు, స్టేడియం రూఫ్(కనోపీ) నిర్మాణంలో నాణ్యత లేమి, మహబూబ్‌నగర్‌లో స్టేడియం కోసం అధిక ధరకు భూమిని కొనుగోలు, కార్పొరేట్ బాక్స్‌ల అమ్మకంలో కమీషన్ వ్యవహారం, కమర్షియల్ ట్యాక్స్ ఎగవేత, టెండర్లు లేకుండా పనుల అప్పగింత తదితర మొత్తం పది అంశాలపై ఏసీబీ కేసు నమోదు చేసి దాదాపు విచారణను సైతం పూర్తి చేసింది. అప్పట్లో హెచ్‌సీఏ బాధ్యతల్లో ఉన్న అర్షద్ అయూబ్, శివలాల్, చలపతితోపాటు మొత్తం కార్యవర్గం వారం రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వారం రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఆయా స్థానాలకు బరిలో మిగిలింది వీరే... అధ్యక్షుడు (పదవి-1): జి.వినోద్, అర్షద్ అయూబ్ ఉపాధ్యక్షులు (పదవులు-5): ఎంవీ శ్రీధర్, జి. వివేకానంద్, కిషన్ రావు, ఇ. వెంకట్రామ్రెడ్డి, నరేందర్‌గౌడ్, యాదగిరి, ప్రకాశ్‌చంద్ జైన్, సురేందర్ అగర్వాల్, మొయిజుద్దీన్, శేష్ నారాయణ్. కార్యదర్శి (1): ఎస్. వెంకటేశ్వరన్, జాన్‌మనోజ్ సంయుక్త కార్యదర్శులు (2): పురుషోత్తం అగర్వాల్, జెరార్డ్ కార్, విజయానంద్, బస్వరాజు కోశాధికారి (1): నరేశ్ శర్మ, దేవరాజ్ ఈసీ సభ్యులు (12): ఛాతిరి బాబూరావు, అద్నాన్ మెహమూద్, ఫారూఖ్, అరుణ్ కుమార్, నర్సింహారెడ్డి, జగ్గూలాల్, చిట్టి శ్రీధర్, మహేంద్ర, శ్రీనివాసరావు, పి.శ్రీధర్, వాల్టర్స్, సూర్యప్రకాశ్, దల్జీత్ సింగ్, భాస్కర్, అనిల్ కుమార్, రాజన్ సింగ్, రమణ, శ్రీనివాస చక్రవర్తి, లక్ష్మీకాంత్ రాథోడ్, వంకా మహేందర్, మనోహర్‌రెడ్డి, విక్టర్ అమల్ రాజ్, జి. శ్రీనివాస రావు, విక్రమ్ మాన్సింగ్, శ్రీనివాస్‌రెడ్డి. -
‘చపాతీ’ కేసులో శివసేనకు ఊరట
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సదన్ క్యాంటిన్లో జరిగిన చపాతి (రొట్టే) వివాదం కేసులో శివసేన ఎంపీలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఊరట కల్పించింది. శివసేనకు చెందిన 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పీల్) హైకోర్టు తిరస్కరించింది. వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ క్యాంటిన్లో భోజనం నాసిరకంగా ఉందంటూ శివసేన ఎంపీలు గత నెల 17న తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. వివిధ మీడియా చానెళ్ల ప్రతినిధులను వెంటేసుకుని క్యాంటిన్‌లోకి ప్రవేశించారు. అక్కడ ప్లేటులో వడ్డించిన భోజనాన్ని చూసి రాజన్ విచారే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోని ఒక చపాతి ముక్క తీసి క్యాంటిన్ సూపర్వైజర్ నోట్లో కుక్కే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని పలు మీడియా చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అయితే ఆ సూపర్వైజర్ ముస్లిం అని... ఆ సమయంలో ఆతడు పవిత్ర రంజాన్ మాసం రోజా (ఉపవాసం) పాటిస్తున్నట్లు తరువాత తెలిసింది. దీంతో శివసేన ప్రత్యర్థులు ఈ ఘటనకు మతం రంగు పూసి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కాగా ఆ రోజు క్యాంటిన్లో విధులు నిర్వహించిన సూపర్వైజర్ అర్షద్ జబెరన్ ఈ ఎంపీలకు వ్యతిరేకంగా ఏ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని తెలియడంతో హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది. దీంతో శివసేన ఎంపీలకు ఊరట లభించింది.