సాక్షి, ముంబై: మహారాష్ట్ర సదన్ క్యాంటిన్‌లో జరిగిన చపాతి (రొట్టే) వివాదం కేసులో శివసేన ఎంపీలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఊరట కల్పించింది. శివసేనకు చెందిన 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పీల్) హైకోర్టు తిరస్కరించింది. వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ క్యాంటిన్‌లో భోజనం నాసిరకంగా ఉందంటూ శివసేన ఎంపీలు గత నెల 17న తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు.
వివిధ మీడియా చానెళ్ల ప్రతినిధులను వెంటేసుకుని క్యాంటిన్‌లోకి ప్రవేశించారు. అక్కడ ప్లేటులో వడ్డించిన భోజనాన్ని చూసి రాజన్ విచారే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోని ఒక చపాతి ముక్క తీసి క్యాంటిన్ సూపర్‌వైజర్ నోట్లో కుక్కే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని పలు మీడియా చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అయితే ఆ సూపర్‌వైజర్ ముస్లిం అని... ఆ సమయంలో ఆతడు పవిత్ర రంజాన్ మాసం రోజా (ఉపవాసం) పాటిస్తున్నట్లు తరువాత తెలిసింది. దీంతో శివసేన ప్రత్యర్థులు ఈ ఘటనకు మతం రంగు పూసి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కాగా ఆ రోజు క్యాంటిన్‌లో విధులు నిర్వహించిన సూపర్‌వైజర్ అర్షద్ జబెరన్ ఈ ఎంపీలకు వ్యతిరేకంగా ఏ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని తెలియడంతో హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది. దీంతో శివసేన ఎంపీలకు ఊరట లభించింది.
‘చపాతీ’ కేసులో శివసేనకు ఊరట
Published Fri, Aug 22 2014 10:28 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement