News Tracker
-
ప్రభుత్వ పాఠశాలల్లో రిలయన్స్ లైఫ్ లైబ్రరీలు
న్యూఢిల్లీ: రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ రూమ్ టు రీడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో వందకు పైగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ అనూప్ రావ్ చెప్పారు. ఈ ఒప్పందాల్లో భాగంగా మొదటి ఏడాది ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరా ఖండ్, మహారాష్ట్రల్లో మునిసిపాలిటీ కార్పొరేషన్ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేసి, నిర్వహిస్తామని పేర్కొన్నారు. తర్వాతి సంవత్సరాల్లో మరిన్ని పాఠశాలల్లో మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. వాణిజ్య సామాజిక బాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ-సీఎస్ఆర్)లో భాగంగా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా 10 వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం కారణంగా ఏర్పాటు చేసే గ్రంథాలయాల వల్ల అక్షరాస్యత, లింగ సమానత్వం పెంపొందిస్తామని వివరించారు. గ్రంథాలయాలు పిల్లల్లో అవగాహనను, అభ్యసన అలవాట్లను, కుతూహలాన్ని పెంపొం దిస్తాయని వివరించారు. భారత్‌లో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలాంటి ప్రయత్నాల ద్వారా ప్రభుత్వానికి తగిన తోడ్పాటునందిస్తామని చెప్పారు. -
బీడ్ ఉప ఎన్నిక
ముంబై: బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించే ఉప ఎన్నికపై దివంగత నాయకుడు గోపీనాథ్ కుమార్తె పంకజా పాల్వేముండే ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి ఎవరు దిగుతారనే విషయం అస్పష్టంగా ఉంది. ప్రస్తుతం పంకజా ‘సంఘర్ష్ యాత్ర’ పేరిట రాష్ర్టవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజ కీయాలపై తనకు ఆసక్తి ఉందనే విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. అయితే పంకజ సోదరి ప్రీతమ్ ముండే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ సీటును మళ్లీ బీజేపీకి దక్కించుకోవడం అంత కష్టం కాకపోవచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ముండే కుటుంబ సభ్యులెవరైనా ముందుకొస్తే వారికి పోటీగా ఈ నియోజకవర్గంనుంచి తమ పార్టీ తరఫున ఎవరినీ బరిలోకి దించబోమని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇక్కడ బీజేపీ గెలుపు నల్లేరుపై నడకే కావచ్చని రాజకీయ పండితులు అంటున్నారు. ఇదిలాఉంచితే ప్రీతమ్ ముండే బీడ్ నియోజవర్గం పరిధిలోని పర్లి, బీడ్, నాసిక్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన రమేష్ అడస్కర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇది కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమే. -
మెట్రోకు భూమిపూజ
సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం మరోల్‌లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
‘చపాతీ’ కేసులో శివసేనకు ఊరట
సాక్షి, ముంబై: మహారాష్ట్ర సదన్ క్యాంటిన్లో జరిగిన చపాతి (రొట్టే) వివాదం కేసులో శివసేన ఎంపీలకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఊరట కల్పించింది. శివసేనకు చెందిన 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (పీల్) హైకోర్టు తిరస్కరించింది. వివరాలిలా ఉన్నాయి... ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ క్యాంటిన్లో భోజనం నాసిరకంగా ఉందంటూ శివసేన ఎంపీలు గత నెల 17న తమదైన శైలిలో ఆందోళన నిర్వహించారు. వివిధ మీడియా చానెళ్ల ప్రతినిధులను వెంటేసుకుని క్యాంటిన్‌లోకి ప్రవేశించారు. అక్కడ ప్లేటులో వడ్డించిన భోజనాన్ని చూసి రాజన్ విచారే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోని ఒక చపాతి ముక్క తీసి క్యాంటిన్ సూపర్వైజర్ నోట్లో కుక్కే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాన్ని పలు మీడియా చానెళ్లు పదేపదే ప్రసారం చేశాయి. అయితే ఆ సూపర్వైజర్ ముస్లిం అని... ఆ సమయంలో ఆతడు పవిత్ర రంజాన్ మాసం రోజా (ఉపవాసం) పాటిస్తున్నట్లు తరువాత తెలిసింది. దీంతో శివసేన ప్రత్యర్థులు ఈ ఘటనకు మతం రంగు పూసి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కాగా ఆ రోజు క్యాంటిన్లో విధులు నిర్వహించిన సూపర్వైజర్ అర్షద్ జబెరన్ ఈ ఎంపీలకు వ్యతిరేకంగా ఏ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయలేదని తెలియడంతో హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది. దీంతో శివసేన ఎంపీలకు ఊరట లభించింది. -
ఊపందుకున్న ‘ గోసీఖుర్ద్ ’ పనులు
నాగపూర్: విదర్భ ప్రాంతంలో సుమారు 2.5 లక్షల హెక్టార్ల పంటభూములకు సాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రారంభించిన గోసీఖుర్ద్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు ఇప్పటికి ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికిగాను నాగపూర్ జిల్లా నుంచి 51 గ్రామాలు, విదర్భకు చెందిన 13 గ్రామాల ప్రజలను తరలించాల్సి వచ్చింది. బాలాఘాట్(ఎంపీ) నుంచి ప్రాణహితా నది(గడ్చిరోలీ) వరకు ప్రవహించే వైన్‌గంగా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు 1983లో ప్రతిపాదనలు వచ్చాయి. చివరకు 1988 ఏప్రిల్ 22న అప్పటి చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భండారాలో ఉన్న గోసీఖుర్ద్ గ్రామంలో అప్పటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. దీనిద్వారా విదర్భ ప్రాంతంలోని నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల్లో సుమారు 2,50,800 హెక్టార్ల భూములకు సాగునీరందించేందుకు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 36,894 హెక్టార్లకే నీరందించగలుగుతున్నారు. 26 యేళ్లపాటు నత్తనడకన సాగిన పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. వచ్చే వర్షాకాలానికల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్మాణం వల్ల నష్టపోయేవారి సంక్షేమం కోసం ఏడాది కిందట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రూ.1,199 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది మేలో రూ.684.18 కోట్లు విడుదల చేశారు. అందులో రూ. 324.92 కోట్లను నాగపూర్, భాంద్రా జిల్లాల్లో బాధిత కుటుంబాలకు చెందిన బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే నాగపూర్ జిల్లా లో 51 గ్రామాలు, భాంద్రా జిల్లాలో 13 గ్రామాలకు చెందిన ముంపు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కాగా, జీవన్‌పూర్, సిర్సి, ఖర్దా,పంజ్రేపార్ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలను కొత్త ప్రాంతాలకు తరలించామని డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తెలిపారు. గతవారం ఆయన ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల పునరావాస కేంద్రాల ప్యాకేజీపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా, మొదటి విడతలో, భాంద్రా జిల్లాలోని ఐదు గ్రామాల్లోని మూడు గ్రామాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆయా గ్రామాల్లో ఉన్న 14,948 గ్రామీణ కుటుంబాల్లో 5,715 కుటుంబాలకు సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటుచేసినట్లు నాగపూర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్(పునరావాసం) రాజ్‌లక్ష్మి షా తెలిపారు. భండారా జిల్లా మీదుగా ప్రవహించే వైన్‌గంగా నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నాగపూర్, భండారా, చంద్రపూర్ జిల్లాల రైతులకు సాగునీటి సమస్య తీరినట్లే..