ఆరు గంటల్లో తిరుమల కొండెక్కిన పారా సైక్లిస్ట్
తిరుమల: ప్రముఖ పారాసైక్లిస్ట్ ఆదిత్య మెహతా బుధవారం అలిపిరి మెట్లమార్గంలో తిరుమల కొండెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మార్గంలోని మొత్తం 3,300 మెట్లను తన కృత్రిమ కాలు (ఆర్టిఫిషియల్ లెగ్) తో ఆరు గంటల్లో ఎక్కారు. అలిపిరి వద్ద ఉదయం 10.45 గంటలకు నడక ప్రారంభించిన ఆయన సాయంత్రం 4.45 గంటలకు తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. గతంలో మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీవారిమెట్టు మార్గంలో 2.05 గంటల్లోనే ఎక్కారు.
ఆదిత్య మెహతా మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు, హైదరాబాద్ మధ్య ఒంటికాలితో పారాసైక్లింగ్ విజయవంతం కావడంతో శ్రీవారికి మొక్కు చెల్లించేందుకు వచ్చానన్నారు. గతంలోనూ శ్రీవారికి మొక్కు చెల్లించడంతో పారాసైక్లింగ్, వికలాంగ క్రీడలకు మంచి ప్రోత్సాహం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. పెట్టుడు కాలుతో ఎక్కేందుకు కొంత ఇబ్బంది ఉన్నా స్వామిపైన భారం వేసి ఆనందంగానే తిరుమలకొండకు చేరుకున్నానని ఆదిత్య మెహతా తెలిపారు.