పరుల భూమిలో పరిటాల | paritala in othars land | Sakshi
Sakshi News home page

పరుల భూమిలో పరిటాల

Published Tue, Dec 20 2016 1:14 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

పరుల భూమిలో పరిటాల - Sakshi

పరుల భూమిలో పరిటాల

  •  దళితులు కొన్న భూమి ప్రభుత్వ స్వాధీనం
  •  ఇళ్ల పట్టాలన్నీ అధికార పార్టీ వారికే !
  •  పైగా ‘పరిటాల’ పేరుతో రాతలు
  •  బి.యాలేరు దళితుల ఆందోళన 
  • సాక్షి టాస్క్‌ఫోర్స్‌ :  
    నిరుపేద దళితులు నిలువునా మోసపోయిన ఉదంతమిది. ఇంటి స్థలాల కోసం వారు కొన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోనీ పట్టాలిచ్చిందా అంటే అదేమీ లేదు. అధికార పార్టీ వారికి మాత్రమే పట్టాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. పైగా ఆ భూమిలో ‘పరిటాల’ పేరుతో రాతలు రాయడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
     
    ఆత్మకూరు మండలం బి.యాలేరు ఎస్సీ కాలనీలో దాదాపు 200 కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. వీరిలో సగం మందికి పైగా సొంత ఇళ్లు కానీ, ఇంటి స్థలాలు కానీ లేవు. ఈ నేపథ్యంలో 2014 మే ఒకటో తేదీన తులసమ్మ అనే మహిళకు చెందిన సర్వే నంబర్‌ 207–6లోని 4.40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.90 వేల చొప్పున చెల్లించారు. ఆ మేరకు అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. కొందరు అక్కడ కొన్ని రోజులపాటు కొట్టాలు వేసుకుని నివాసం కూడా ఉన్నారు. అయితే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా ప్రభుత్వ భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వారికి అందులో పట్టాలు ఇస్తామని నమ్మబలికారు. దళితులు చేసేదేమీ లేక పట్టాలు పంపిణీ చేస్తే తమకు కూడా స్థలం వస్తుంది కదా అనుకుని సరిపెట్టుకున్నారు. అయితే వారికి  నిరాశే ఎదురైంది. రెవెన్యూ అధికారులు రూపొందించిన లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేవు. అంతా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారని, అందులోనూ అనర్హులకు చోటు కల్పించారని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో లేని వారికి, ఒక్క రేషన్ కార్డుపై రెండు పట్టాలు ఇచ్చేందుకు సైతం అధికారులు సిద్ధపడ్డారని చెబుతున్నారు. తామంతా వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు కావడంతోనే అధికార పార్టీ నాయకులే ఈ విధంగా పావులు కదిపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు భూమిలో రాళ్లు పెట్టి.. వాటికి పసుపు రంగు పెయింటుతో ‘పరిటాల’ అని రాసి(చిత్రంలో చూపినట్లు) ఉండటాన్ని మించిన ఆధారం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా, బాధితులు తులసమ్మ వద్దకెళ్లి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని, తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడిగారు. అయితే ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. దళితులకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తే అందుగ్గానూ మరోచోట ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు భూమిని కూడా ఇప్పించినట్లు సమాచారం. 
     
    తాత్కాలికంగా నిలుపుదల చేశాం : ఈ విషయంపై ఆత్మకూరు తహశీల్దార్‌ నాగరాజును వివరణ కోరగా.. బి.యాలేరులోని ఎస్సీలకు పంపిణీ చేయాల్సిన ఇళ్ల పట్టాల జాబితాను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. 
     
    దళితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు : పెన్నోబులేసు, వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు    
    బి.యాలేరులో దళితులకు ఇళ్ల స్థలాల పంపిణీ ఏకపక్షంగా జరుగుతోంది. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పేరు చెప్పుకొని అధికార పార్టీ నాయకులు దళితులకు అన్యాయం చేస్తున్నారు. వారికి పంపిణీ చేయాల్సిన భూమిలో ‘పరిటాల’ పేరు రాయడం అన్యాయం. దళితులకు  న్యాయం జరక్కపోతే రెవెన్యూ అధికారులపై కేసులు పెడతాం. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement