నిజామాబాద్ : ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తనను పట్టించుకోవటం లేదంటూ ఓ రోగి ఆసుపత్రి బెల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మక్లూర్ మండలం కృష్ణానగర్‌కు చెందిన శంకర్ (35) వ్యక్తిగత కారణాలతో నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో శరీరం చాలా భాగం కాలిపోయింది. కాలిన గాయాలతో అతడు కొంతకాలంగా నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది తనను పట్టించుకోవడం లేదని... సరైన వైద్యం అందించటం లేదంటూ శంకర్ వారితో తరచు ఘర్షణకు దిగేవాడు.
ఈ నేపథ్యంలోనే అతడు గురువారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి కిందికి దూకాడు. శుక్రవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న శంకర్ను ఆసుపత్రి సిబ్బంది గుర్తించి...ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే అతడు అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న శంకర్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. అతడి మృతికి సిబ్బందితోపాటు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వారు ఆరోపించారు. పోలీసులు రంగంలోకి దిగి.. శంకర్ కుటుంబసభ్యుల ఆందోళనను విరమించేందుకు యత్నిస్తున్నారు.