ఇష్టారాజ్యం
- పవన్ విద్యుత్ కంపెనీల బరి తెగింపు
- రైతుల నుంచి కారుచౌకగా భూముల కొనుగోలు
- కొనని వాటిలోనూ పనులు
- అడ్డగోలు వ్యవహారాలకు అధికార పార్టీ నేతల అండ
- న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న బాధితులు
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పవన్ విద్యుత్ (గాలిమరలు) కంపెనీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన దళారుల సాయంతో రైతుల నుంచి భూములను కారుచౌకగా కొట్టేయడమే కాకుండా పక్క రైతుల పొలాల్లోనూ దౌర్జన్యంగా పనులు చేస్తున్నారు. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వారికి బాసటగా నిలవాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కొందరు బాధితులు న్యాయస్థానాల తలుపు తడుతున్నారు.
కళ్యాణదుర్గం : పవన విద్యుత్ తయారీకి కళ్యాణదుర్గం ప్రాంతం అత్యంత అనువైనది. దీంతో ఈ ప్రాంతానికి కంపెనీలు క్యూ కడుతున్నాయి. భారీసంఖ్యలో గాలిమరలను ఏర్పాటు చేస్తున్నాయి. అసలే కరువు ప్రాంతం కావడం, వర్షాధార భూములు అధికంగా ఉండడం, వరుస పంట నష్టాలతో రైతులు కూడా కష్టాల్లో కూరుకుపోవడంతో కంపెనీల పని సులువు అవుతోంది. ప్రస్తుతం కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు మండలాల్లో కనుచూపు మేర ఎక్కడ చూసినా గాలిమరలే దర్శనమిస్తున్నాయి. హీరో, సుజలాన్, యాస్పిన్, గమేశా, గ్రీన్‌కో, యాక్సిస్, ఎకోరియన్, విండ్‌పవర్ సంస్థలు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి.
అధికార పార్టీకి చెందిన కొందరిని దళారులుగా నియమించుకుని, వారి సాయంతో రైతుల నుంచి తక్కువ ధరతోనే భూములు కొనుగోలు చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా సమీప రైతుల పొలాల్లోనూ పనులు చేపడుతూ..వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కంపెనీల ఆగడాలను అరికట్టి, రైతులకు అండగా నిలవాల్సిన రెవెన్యూ, పోలీసు అధికారులు కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. రైతులు ఫిర్యాదులు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా వారిలో చలనం కన్పించడం లేదు.
బరి తెగించి నిర్మాణాలు
కంబదూరు మండలం తిమ్మాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో రైతులు నరసన్నగౌడ్, మంజునాథ, రవిచంద్రగౌడ్ నుంచి సర్వే నంబర్లు 22–1ఏ, 1బీ, 1సీలలోని 16 ఎకరాల భూమిని విండ్ పవర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసింది. ఇదే భూమిని వాయి ఉజ్రా భారత్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నాలుగింతల ఎక్కువ ధరకు విక్రయించింది. పై సర్వే నంబర్లలోని భూమిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మించాల్సి ఉండగా.. దాన్ని వదిలి పక్కనే ఉన్న రైతు రవిచంద్ర గౌడ్‌కు చెందిన సర్వే నంబర్ 22–1లోని 7.50 ఎకరాల పొలంలో పనులు చేపడుతోంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసింది. దీనిపై బాధిత రైతు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సర్వేయర్ తిమ్మరాజు పొలాన్ని సర్వే చేశారు.
వాయి ఉజ్రా కంపెనీ కొనుగోలు చేయని పొలంలో సబ్‌స్టేషన్ నిర్మించినట్లు ఆయన గుర్తించారు. ఇదే విషయాన్ని తహసీల్దార్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కంపెనీ నిర్వాకంపై బాధిత రైతు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాడు. ఇదే కంపెనీ నిర్వాహకులు తమను ధర విషయంలో మోసం చేశారంటూ కుందుర్పి మండలం ఎస్.మల్లాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు తావ్రేనాయక్, రామ్మూర్తి కోర్టును ఆశ్రయించారు. అలాగే ఎస్.మల్లాపురం చెరువులో అనుమతులు లేకుండానే ప్రైవేట్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి, వర్లి, కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూ గ్రామాల పరిధిలోనూ ఓ కంపెనీ వారు ఈ తరహాలో మోసాలకే పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వర్లి చెరువులో అనుమతుల్లేకుండా ఏకంగా రోడ్డు నిర్మిస్తున్నారు.
సామాజిక బాధ్యతకు మంగళం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పవన విద్యుత్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద వివిధ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సమీప గ్రామాల్లో తాగునీరు, పాఠశాలల అభివృద్ధి, వీధిలైట్లు, ఆలయాల అభివృద్ధి, సీసీరోడ్లు తదితర అభివృద్ధి పనులకు చేయూతనివ్వాలి. అయితే.. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.
ముఖ్యనేత కనుసన్నల్లోనే...
కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని శాసిస్తున్న టీడీపీ ముఖ్యనేత కనుసన్నల్లోనే గాలిమరల వ్యవహారాలు నడుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ ఏ కంపెనీ భూసమీకరణ చేయాలన్నా, ఇతరత్రా పనులు చేపట్టాలన్నా సదరు నాయకుడి అండ తప్పనిసరి. ఆ నేతను ప్రసన్నం చేసుకుంటే పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. ఎవరైనా అడ్డొచ్చినా వారి మనుషులే చూసుకుంటారు. భూసమీకరణ విషయంలో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రైతులకు అన్యాయం చేస్తున్నా సదరు నాయకుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.