పీబీసీ నీరు అక్రమంగా వాడుకుంటే చర్యలు
లింగాల : తుంగభద్ర నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని అక్రమంగా వాడుకుంటే చర్యలు తీసుకుంటామని ఈఈ కిరణ్‌కుమార్ హెచ్చరించారు. నెల రోజులుగా తుంపెర డీప్‌కట్ కెనాల్ ద్వారా సీబీఆర్‌కు నీళ్లు వస్తున్నాయి. తుంపెర నుంచి సుమారు 16కి.మీ పొడవునా డీప్‌కట్ కెనాల్, వంకలు, వాగుల గుండా పీబీసీ నీరు సీబీఆర్‌కు చేరుతున్నాయి. నార్పల మండలం రామాపురం, ముచ్చుకుంటపల్లె, తుంపెర, తాడిమర్రి మండలంలోని పాలెం, కనుమకుంట్ల, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల గ్రామాల మధ్య పీబీసీ నీరు ప్రవహిస్తూ సీబీఆర్‌లోకి చేరుకుంటాయి. పీబీసీ నీటిని ఆయా గ్రామాల రైతులు కాలువపై, వంకలు, వాగుల్లో అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీన సాక్షి దినపత్రికలో ‘‘తుంపెర గేట్లు ఎత్తేందుకు యత్నం’’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఈఈ కిరణ్‌కుమార్ పీబీసీ సిబ్బందితో కలిసి మంగళవారం తుంపెర కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీబీసీ నీటిని ఆయా గ్రామాల రైతులు కాలువపై, వంకలు, వాగుల్లో అక్రమంగా మోటార్లు అమర్చి వాడుకోవడం వాస్తవమేనన్నారు. అక్రమ నీటి వినియోగదారులకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
నేటినుంచి పోలీసు నిఘా
తుంపెర కాలువ వెంబడి అమర్చిన అక్రమ విద్యుత్ మోటార్లను వెంటనే తొలగించాలని ఈఈ హెచ్చరించారు. బుధవారం నుంచి తాడిమర్రి పోలీసులచే నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ నీటి వినియోగదారులపై కేసులు నమోదు చేయిస్తామన్నారు.