చేతులెట్లాడాయో..! | Husband Killed His wife and child | Sakshi
Sakshi News home page

చేతులెట్లాడాయో..!

Published Tue, Jan 24 2017 10:26 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

చేతులెట్లాడాయో..!

చేతులెట్లాడాయో..!

- కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను కడతేర్చిన మృగాడు
 – మద్యం మత్తులో పైశాచికం
– లింగాలలో విషాద ఛాయలు
అగ్నిసాక్షిగా వివాహమాడాడు. సుఖ దుఃఖాల్లో తోడు నీడలా ఉంటానని బాస చేశాడు. మూడు ముళ్ల బంధం పడిన మూడేళ్లకే ముక్కుపచ్చలారని చిన్నారితో సహా.. అర్ధాంగిని అమానుషంగా కడతేర్చాడు. తల్లీబిడ్డల దారుణ హత్య ప్రతి ఒక్కరి కంట తడి పెట్టించింది.
లింగాల:  లింగాల మండల కేంద్రానికి చెందిన ముచ్చుమర్రి ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసై శాడిస్ట్‌గా మారాడు. నాలుగేళ్ల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికి మండలం కుందనకోట గ్రామానికి చెందిన పుల్లమ్మ కుమార్తె వెంకట కృష్ణమ్మను వివాహం చేసుకున్నాడు. ఈమెకు పోలియో కారణంగా కుడిచేయి చిన్నగా ఉంది. అయినా వారి దాంపత్య జీవితం సజావుగా సాగేది. అప్పుడప్పుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేసేవాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నిండు గర్భిణీగా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రతాప్‌రెడ్డి అక్కడికి వెళ్లి మద్యం తాగి గొడవపడేవాడని మృతురాలి తల్లి పుల్లమ్మ తెలిపింది. దీంతో వెంకటకృష్ణమ్మ సుమారు 8 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ప్రతాప్‌రెడ్డి అత్తింటికి వెళ్లి బ్యాంకులో తన భార్య పేరిట డబ్బులున్నాయి. వాటిని డ్రా చేసుకొని తిరిగి పంపిస్తానని నమ్మబలికి సోమవారం రాత్రి 8.30 గంటలకు లింగాలకు తీసుకొచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలిక(పొలంలో కలుపు తీసే పరికరం)తో భార్య వెంకటకృష్ణమ్మ(25) తలపై కొట్టాడు. అతని నుంచి తప్పించుకొనేందుకు ఆమె బయటకు పరుగులు తీసింది. అయినా వదల్లేదు. ఇంటి ముంగిట్లోనే హతమార్చాడు. అనంతరం ఇంటిలో ఉన్న 6నెలల చిన్నారిని తొలికతో కొట్టి హతమార్చి పరారయ్యాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ప్రతాప్‌రెడ్డి పెద్దనాన్న కుమారుడు రామచంద్రారెడ్డి వ్యవసాయ పనుల కోసం వెళుతూ అక్కడికి వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశాడు.
ప్రతాప్‌రెడ్డిని ఇంట్లోనుంచి గెంటేశారు..
ప్రతాప్‌రెడ్డిని అతని కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితమే ఇంట్లో నుంచి గెంటివేశారు. మద్యానికి బానిసై ఇంటిల్లిపాదిని వేధిస్తుండటంతో అతని తల్లి, సోదరులు పొలం పనులు చేసుకొని బతుకుపో అంటూ పంపేశారు. దీంతో అతను హైస్కూలు సమీపంలో, బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఉన్న అతని పెద్దనాన్న ఇంటిలో నివాసం ఉంటున్నాడు.
గ్రామంలో విషాద ఛాయలు.. :
ప్రతాప్‌రెడ్డి భార్యను, 6నెలల చిన్నారిని హత్య చేశాడన్న విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్యను, పసికందును హతమార్చడం చూసి గుండెలు పగిలేలా విలపించారు. వెంకటకృష్ణమ్మ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల హృదయాలను కలిచివేసింది.
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
మంగళవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు. విగత జీవుల్లా పడి ఉన్న వెంకటకృష్ణమ్మ, ఆమె కుమార్తె 6నెలల పాపను పరిశీలించారు. వారి బంధువులను విచారించారు. ఘటనకు కారకుడైన ప్రతాప్‌రెడ్డి కోసం పొలాల్లో గాలించారు. వెంకటకృష్ణమ్మ తల్లి పుల్లమ్మ, సోదరుడు వెంకటరెడ్డిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణుడు తెలిపారు.
దిగ్భా​‍్రంతి వ్యక్తం చేసిన నాయకులు
ఇలాంటి దారుణం ఎక్కడా జరగలేదని.. పసికందు అని కూడా చూడకుండా 6నెలల పాపను హతమార్చడం కిరాతకమని వైఎస్‌ఆర్‌సీపీ మండల యూత్‌ కన్వీనర్‌ మనోహర్‌రెడ్డి, లింగాల వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు సారెడ్డి చంద్రశేఖరరెడ్డిలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement