ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు రాఘవుల నాయుడిపై ఆదివారం పీడీ యాక్ట్ నమోదైంది.
- ఆదేశాలు జారీ చేసిన చిత్తూరు కలెక్టర్
- ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యం
చంద్రగిరి (చిత్తూరు): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు రాఘవులు నాయుడిపై ఆదివారం పీడీ యాక్ట్ నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు కూతవేటు దూరంలో ఉన్న బందార్లపల్లె గ్రామానికి చెందిన రాఘవులు నాయుడు కొన్నేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతడు తిరుపతి, బెంగళూరు, విజయవాడ సమీప ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైప ఆస్తులను సంపాదించాడని ఆరోపణలున్నాయి.
ఫిబ్రవరి నాలుగో తేదీన చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు సిద్ధం చేస్తుండగా రాఘవులునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అప్పటినుంచి అతడు తిరుపతి సబ్‌జైలులో ఉన్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి రాఘవులునాయుడుపై పలు కేసులు ఉండటంతో అతనిపై పీడీ యాక్టు నమోదు చేస్తూ కలెక్టర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారని చంద్రగిరి సీఐ శివప్రసాద్ తెలిపారు. అనంతరం రాఘవులునాయుడును తిరుపతి సబ్‌జైలు నుంచి కడప సెంట్రల్ జై లుకు తరలించారు.