వేంపల్లి: 2012–13 రబీ సీజన్‌కు సంబంధించి బీమా మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మంగళవారం హైకోర్టులో బీమా ఆలస్యంపై ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఎంపీపీ రవికుమార్ రెడ్డి తరఫు న్యాయవాది జానకి రామిరెడ్డి,బీమా కంపెనీకి చెందినన్యాయవాది మధ్య వాదోపవాదాలు జరిగాయి.వైఎస్సార్‌సీపీ నాయకులు,వేంపల్లి మండలాధ్యక్షులు మాచిరెడ్డి రవికుమార్‌రెడ్డి,2012–13 రబీ సీజన్‌లో శనగ పంటకు బీమా అందక పోవడంతో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో ఈ వాదనలు జరిగాయి. చిన్న సాకులు చూపించి బీమా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు బీమా కంపెనీ అధికారులను, వారి తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.దీంతో వారు హైకోర్టుకు ఈ విధంగా విన్నవించారు.ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతోనే ఇవ్వలేక పోతున్నామని చెప్పారు. రైతులకు బీమా సొమ్మును ఎప్పుడు ఇచ్చేది రెండువారాల్లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.ప్రభుత్వం తమ వాటా నిధులు విడుదల చేయగలిగితే కడప జిల్లాలో 50,000మంది రైతులకు మేలు చేకూరుతుంది. దాదాపు రూ.130 కోట్ల మేర బీమా పరిహారం అందే అవకాశం ఉంది.