లక్ష్మీపుత్రుని ఇంట్లో సంబరాలు
♦ స్వగ్రామం చేరుకున్న పెన్నయ్య
♦ మళ్లీ యాచక వృత్తి చేయబోనని వెల్లడి
బుక్కరాయసముద్రం: అక్షరాలా రూ.65 లక్షల లాటరీ తగలిన వడ్డే చిన్న పెన్నయ్య ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. పెన్నయ్య స్వగ్రామం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు. భార్య రామాంజనమ్మ, ముగ్గురు పిల్లలు స్నేహలత, హర్షవర్దన్, లక్షీ్ష్మనరసింహ ఉన్నారు. కుటుంబ పోషణకు పెన్నయ్య 2011లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో రాళ్లు కొట్టడానికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో పనులు చేయలేక యాచక వృత్తిని ఎంచుకున్నాడు.
కేరళలోని ఓ బస్టాండ్‌లో భిక్షమెత్తేవాడు. మూడునెలలకోసారి స్వగ్రామానికి వచ్చి ఇంట్లో వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి మళ్లీ వెళ్లేవాడు. లాటరీ టికెట్లు కొనే అలవాటున్న పెన్నయ్యకు అదే తన జీవితాన్ని మారుస్తుందని కలలో ఊహించి ఉండడు. లాటరీలో రూ.65 లక్షలతో పాటు కన్సొలేషన్ బహుమతి కింద రూ.90 వేలు రావడంతో పెన్నయ్య కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెన్నయ్య శనివారం కేరళ నుంచి స్వగ్రామం కొర్రపాడుకు చేరుకున్నాడు. ట్యాక్స్, ఏజెంట్ ఖర్చులు పోను రూ.40 లక్షలు అతనికి అందనున్నాయి.
పిల్లల్ని బాగా చదివించుకుంటాం: రామాంజినమ్మ
లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లలను బాగా చదివించుకుంటాం. కుటుంబ పోషణ సక్రమంగా లేక అనేక ఇబ్బందులు పడ్డా. నా భర్త ఇతర రాష్ట్రాలకు వెళ్లి చాలా ఇబ్బందులు పడ్డాడు. లాటరీలో డబ్బు వచ్చాయంటే చాలా సంతోషంగా ఉంది.
ఇల్లు నిర్మించుకుంటా: పెన్నయ్య
గ్రామంలో మాకు సొంతిల్లు లేదు. నా భార్యా పిల్లలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. గ్రామంలో సొంత ఇల్లును నిర్మించుకుని ప్రశాంత జీవనం సాగిస్తా. మళ్లీ యాచక వృత్తికి వెళ్లను. ఇంటి వద్దే ఏదో ఒక పని చేసుకుంటా.