జన్మభూమిలో కొందరికే పింఛన్లు ఇవ్వగలం
ఎమ్మెల్యే రాజు
బుచ్చెయ్యపేట : రాష్ట ఆర్థిక పరిస్థితి బాగా లేనందునే అర్హులందరికీ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు తెలిపారు. శనివారం బుచ్చెయ్యపేటలో విలేకర్లతో మాట్లాడారు. జన్మభూమిలో కొందరికి మాత్రమే పింఛన్లు, రేషన్‌కార్డులు అందిస్తామని, మిగిలిన వారికి తరవాత పథకాలు అందేలా చూస్తామన్నారు. పోలవరం కాలువ నీరు నియోజకవర్గంలో అన్ని మండలాలకు తీసికొచ్చి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామన్నారు. సంక్రాంతి తరవాత కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం, ఎల్‌బి పురం ఎత్తిపోతల పథకాలకు శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, గోకివాడ కోటేశ్వరరావు, ఎం.తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సేవ దైవ సేవతో సమానం
రావికమతం : దివ్యాంగుల సేవ ఆ దేవుని సేవతో సమానమని అంతా వారి పట్ల సేవా భావంతో ఉండాలని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు అన్నారు. ఏపీ సర్వశిక్ష అభియాన్ సహిత విద్యా కార్యక్రమం, జిల్లా వయో వృద్ధులు, వికలాంగ సంక్షేమ శాఖ సౌజన్యంతో రావికమతం భవిత కేంద్రంలోని దివ్యాంగ పిల్లలకు శనివారం 22 ట్రై సైకిల్, వీల్‌చైర్స్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో దివ్యాంగ విద్యార్థికి ఏడాదికి రూ.85వేలు చొప్పున ఖర్చుచేస్తోందన్నారు. ఎంపీపీ దంగేటి రామకృష్ణ, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి, పైలా ఫౌండేషన్ అధినేత సన్యాసిరావు, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ వెంకట రమణ, అధికారులు పాల్గొన్నారు. కాగా 2017 సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు.