బాలకృష్ణ హామీలన్నీ మునిగె..
హిందూపురం: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ఆ రోజు రాత్రంతా జాగరణ ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
హిందూపురంలోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాలకృష్ణ.. గెలిచాక నియోజకవర్గానికి రావడం కూడా మానేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న హస్నాబాద్ వర్షం వస్తే చెరువును తలపిస్తుంది. అదేవిధంగా గాంధీనగర్, ఆజాద్‌నగర్ ప్రాంతాలు కూడా వర్షం వచ్చిన ప్రతిసారీ నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
రూ.10 లక్షలు మంజూరైనా పనుల్లేవ్
న్యూ హస్నాబాద్ నుంచి అహ్మద్ నగర్ వరకు ప్రత్యేక డ్రైన్ నిర్మించడానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేశారు. అయినా ఈ పనులను ఇంతవరకు మొదలు పెట్టలేదు.
మాగోడు పట్టించుకునే వారు లేరు
వర్షం వస్తే భయమేస్తుంది. డ్రైన్ల మురికి వర్షపునీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. పిల్లలు, పెద్దలు రాత్రంతా ఇంట్లో చేరిన నీటిని ఎత్తివేయడం సరిపోతుంది. ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
–రజీయా, హస్నాబాద్
ఇబ్బందులు తప్పడం లేదు
వర్షపునీరు ఇళ్లలోకి రాకుండా అండర్ డ్రైన్ ద్వారా బయటకు వెళ్లడానికి కొత్త డ్రైన్ వేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వచ్చి మూడునెలల్లో పూర్తి చేసి సమస్య లేకుండా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏమిచేయలేదు. మాకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
- వాజిద్, హస్నాబాద్
కౌన్సిల్‌లో చాలాసార్లు ప్రస్తావించా
హస్నాబాద్, అహ్మద్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల ఇబ్బందుల గురించి చాలాసార్లు కౌన్సిల్‌లో ప్రస్తావించాను. అధికారులు ఇదిగో.. అదిగో.. అంటున్నారే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. కనీసం కాల్వలు కూడా శుభ్రం చేయించడం లేదు.
- ఆసీఫ్‌వుల్లా, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్