water full
-
కానరావా కన్నీళ్లు?!
కర్నూలు సిటీ: దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా రాయలసీమ గుర్తింపు పొందింది. అలాంటి ప్రాంతానికి సాగు, తాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా.. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు ఉన్న రిజర్వాయర్లు కాదని, ఎలాంటి కేటాయింపులూ లేని ప్రాంతానికి నీటిని తరలిస్తున్నా జిల్లాకు చెందిన నేతలు పట్టించుకోవడం లేదు. కృష్ణా జలాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా తొణికిసలాడుతున్నప్పటికీ జిల్లాలోని గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లకు నీరందని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సీమకు కృష్ణా జలాలు తరలించి గోరుకల్లులో 10 టీఎంసీలు, అవుకులో 4 టీఎంసీలు నింపుతామని, గండికోటకు కూడా నీరు తీసుకుపోతామని గత నెల 28న జరిగిన నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీర్మానం చేశారు. కానీ ఇంత వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి 3.63 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉంది. దీంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి (885 అడుగులు) చేరువలో ఉంది. దీంతో నేడు (శనివారం) రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీశైలం క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువనున్న సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. అవకాశమున్నా అన్యాయమే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు అవకాశం ఉన్నా.. నిన్న, మొన్నటి వరకు కేవలం 2 నుంచి4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే ఇచ్చారు. ఈ నీటిలో నుంచి కూడా కేసీ ఎస్కేపు ఛానల్ నుంచి నిప్పులవాగు ద్వారా నెల్లూరు జిల్లాలోని సోమశిలకు పంపించారు. ఎస్ఆర్బీసీకి ఇవ్వలేదు. ఎక్కువ నీటిని తీసుకునేందుకు అవకాశం లేదని, మీరు గట్టిగా మాట్లాడితే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో బంద్ చేయాలని కూడా జల వనరుల శాఖలోని ఓ ఉన్నతాధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. గురువారం శ్రీశైలానికి భారీ వరద రావడంతో తప్పనిసరి పరిస్థితిలోనే పోతిరెడ్డిపాడు నుంచి 26 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కానీ ఎస్ఆర్బీసీకి మాత్రం తక్కువగానే నీటిని విడుదల చేస్తున్నారు. గోరుకల్లు నిండేదెప్పుడు? శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద జిల్లాలో 1.55 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువకు 19 టీఎంసీల శ్రీశైలం నీటి వాటా ఉంది. దీని ప్రధాన కాలువ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ప్రారంభమవుతుంది. 16.34 కి.మీ దగ్గర ఉన్న బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నుంచి 16 బ్లాకులు 198 కి.మీ వరకు ఉన్నాయి. ఇదేమార్గంలో 50.22 కి.మీ దగ్గర గోరుకల్లు రిజర్వాయర్ 12.34 టీఎంసీల సామ«ర్థ్యంతో, 112 కి.మీ వద్ద 4.62 టీఎంసీల సామర్థ్యంతో అవుకు స్టేజీ–1,2 రిజర్వాయర్లు ఉన్నాయి. కాలువ నిర్మాణ సమయంలో 11,150 క్యూసెక్కుల మేరకు మాత్రమే డిజైన్ చేశారు. ఈ కాలువ నుంచి గాలేరుకు నీరు పంపించడం కోసం 21 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచేందుకు చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయినా ఇప్పుడు 10 వేల క్యూసెక్కుల నీటిని ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మూడు వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇలా అయితే 12.34 టీఎంసీల సామర్థ్యం ఉన్న గోరుకల్లు నిండేదెప్పుడు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఇందులో 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు ఆవుకు టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులకుపైగా పంపిస్తామన్న ఇంజినీర్లు ఇంత వరకు ఆ స్థాయిలో పనులు పూర్తి చేలేదని తెలుస్తోంది. అదే విధంగా అవుకు రిజర్వాయర్‌లో మూడు టీఎంసీలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. ఇందుకు కారణం ఆ స్థాయిలో నీటి నిల్వకు అటవీశాఖ అనుమతులు లేకపోవడమే. అనుమతులు తీసుకోవడంలో నాలుగేళ్లుగా నాన్చుతున్నారు. ఇక వైఎస్సార్ జిల్లాలోని గండికోటకు నీరు పంపించాలంటే ఎస్ఆర్బీసీకి నీటి విడుదల పెంచాలని ఆ జిల్లా రైతులు, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరుకు నీటి తరలింపులో ఆంతర్యమేమిటి? రాయలసీమకు చెందిన రిజర్వాయర్లు నింపకుండానే గత నెల 25 నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేస్తున్న నీటిని గుట్టుచప్పుడు కాకుండా కేసీ ఎస్కేపు ఛానల్ ద్వారా నిప్పులవాగుకు, అక్కడి నుంచి కుందూ నది గుండా నేరుగా నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయరుకు పంపుతున్నారు. ఇప్పటికే 15 టీఎంసీలకుపైగా నీటిని పంపించారు. ఇంజినీర్లు మాత్రం 4.8 టీఎంసీలే పంపించినట్లు చెబుతున్నారు. వాస్తవానికి సోమశిలకు కృష్ణా జలాలను తరలించేందుకు ఎలాంటి హక్కు కానీ, వాటా కానీ లేదు. కేవలం చెన్నైకు తాగునీరు ఇచ్చేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపి ప్రతి ఏటా రాయలసీమ కాలువలకు నీరు ఇవ్వకుండా సోమశిలకు తరలించడంలో ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఇంజినీర్లే అభిప్రాయపడుతున్నారు. -
బాలకృష్ణ హామీలన్నీ మునిగె..
హిందూపురం: సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే ఆ రోజు రాత్రంతా జాగరణ ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. హిందూపురంలోనే ఉండి సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాలకృష్ణ.. గెలిచాక నియోజకవర్గానికి రావడం కూడా మానేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న హస్నాబాద్ వర్షం వస్తే చెరువును తలపిస్తుంది. అదేవిధంగా గాంధీనగర్, ఆజాద్‌నగర్ ప్రాంతాలు కూడా వర్షం వచ్చిన ప్రతిసారీ నిండిపోతున్నాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రూ.10 లక్షలు మంజూరైనా పనుల్లేవ్ న్యూ హస్నాబాద్ నుంచి అహ్మద్ నగర్ వరకు ప్రత్యేక డ్రైన్ నిర్మించడానికి ప్రభుత్వం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ పనులకు ఎనిమిది నెలల క్రితం ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేశారు. అయినా ఈ పనులను ఇంతవరకు మొదలు పెట్టలేదు. మాగోడు పట్టించుకునే వారు లేరు వర్షం వస్తే భయమేస్తుంది. డ్రైన్ల మురికి వర్షపునీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుంది. పిల్లలు, పెద్దలు రాత్రంతా ఇంట్లో చేరిన నీటిని ఎత్తివేయడం సరిపోతుంది. ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. –రజీయా, హస్నాబాద్ ఇబ్బందులు తప్పడం లేదు వర్షపునీరు ఇళ్లలోకి రాకుండా అండర్ డ్రైన్ ద్వారా బయటకు వెళ్లడానికి కొత్త డ్రైన్ వేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వచ్చి మూడునెలల్లో పూర్తి చేసి సమస్య లేకుండా చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏమిచేయలేదు. మాకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. - వాజిద్, హస్నాబాద్ కౌన్సిల్లో చాలాసార్లు ప్రస్తావించా హస్నాబాద్, అహ్మద్‌నగర్, గాంధీనగర్ ప్రాంతాల ఇబ్బందుల గురించి చాలాసార్లు కౌన్సిల్లో ప్రస్తావించాను. అధికారులు ఇదిగో.. అదిగో.. అంటున్నారే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు. కనీసం కాల్వలు కూడా శుభ్రం చేయించడం లేదు. - ఆసీఫ్‌వుల్లా, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ -
మానేరు పరవళ్లు
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్ : మానేరువాగు పరవళ్లు తొక్కింది. ఎగువ మానేరు నిండుకుండలా నిండి మత్తడి దూకుతోంది. 2012లో పారిన మానేరువాగుకు ఇప్పుడు జలకళ వచ్చింది. ఉదయం నుంచే వరద ప్రవాహం పెరిగింది. దీంతో జనం పులకించిపోయారు. మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని వాగులో గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఆమె వెంట కౌన్సిలర్ దార్నం అరుణ ఉన్నారు. సిరిసిల్ల హిందూ ఉత్సవ సమితి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నదీ స్వాగత్ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేపూరి శ్రీనివాస్, మేర్గు సత్యం, నాగుల సంతోష్‌గౌడ్, చిట్నేని సంజీవరావు, శివప్రసాద్, కౌన్సిలర్ వెల్ముల స్వరూపారెడ్డి, మాజీ కౌన్సిలర్ చేపూరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మానేరు వంతెన, మడేళేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి మానేరు ప్రవాహాన్ని పట్టణవాసులు తిలకించి పులకించిపోయారు. సిరిసిల్ల ‘కొత్త’ చెరువుకు బుంగ పట్టణ శివారులోని కొత్తచెరువు తూము వద్ద బుంగ పడింది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కొత్త చెరువుకు బుంగపడడంతో నీరు వృథాగా పోతోంది. చెరువుకు గండిపడే ప్రమాదం ఉందని శాంతినగర్ వాసులు భయాందోళనలు నెలకొన్నాయి. బుంగను కట్టడి చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు శ్రమించారు. కానీ ఫలించలేదు. ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. చెరువుకు గండి పడకుండా, బుంగను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదనీటిలో కార్మికవాడలు సిరిసిల్ల రూరల్ : ముష్టిపల్లి పరిధిలోని రాజీవ్‌నగర్‌లో కార్మికవాడ వర్షపునీట మునిగింది. 13 ఇళ్లు వర్షపునీటిలో చిక్కుకున్నాయి. ఈదుల చెరువు నిండి మత్తడి పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాసం శ్రీహరి అనే నేత కార్మికుడి ఇంటి చుట్టూ వర్షపు నీరు చేరి బయటకు రాకుండా తయారైంది. తంగళ్లపల్లి వద్ద మానేరులో ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. సర్పంచ్ కోడి సునీత, ఎంపీటీసీలు అంకారపు అనిత, పడిగెల మానస, నాయకులు పడిగెల రాజు, కోడి అంతయ్య, అంకారపు రవీందర్ పాల్గొన్నారు. జిల్లెల్లలో బర్ల సుశీలతోపాటు, అంకిరెడ్డిపల్లిలో మూడు, రాళ్లుపేటలో రెండు, లక్ష్మీపూర్‌లో ఒక ఇల్లు వర్షం ధాటికి ధ్వంసమయ్యాయి. పిడుగుపాటుకు చంద్రంపేటలో గేదె మృతి చెందింది. గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఎల్లవ్వకు గాయాలయ్యాయి. సుమారు రూ.4లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యూత్ నాయకుడు ప్రభుదాస్ తెలిపారు. పొంగి పొర్లుతున్న వాగులు..వంకలు గంభీరావుపేట : ఏకధాటి వర్షం..రహదారులు జలమయం..నీట మునిగిన పంట పొలాలు..అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు..పొంగి పొర్లుతున్న వాగులు.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో నీటి వనరులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు పారడంతో బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మల్లారెడ్డిపేట, కోరుట్లపేట, నర్మాల, కోళ్లమద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మానేరు వాగు ఉధృతిలో గంధ్యాడపు రాజేశం అనే రైతుకు చెందిన సుమారు రూ. లక్ష విలువ గల రెండు ఎడ్లు మృతి చెందాయి. కరెంటు మోటార్లు, వ్యవసాయ పనిముట్లు నీటి ప్రవహాంలో కొట్టుకుపోయాయి. వర్షాలకు లింగన్నపేట, గంభీరావుపేటలో పలువురి ఇళ్లు కూలిపోయాయి. గంగమ్మ తల్లీ..సల్లంగ సూడమ్మా ఈసందర్భంగా ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ నర్మాల ఎగువమానేరు తీరాన మా‘నీటి’కి పూజలు నిర్వహించారు. ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ కొమిరిశెట్టి లక్ష్మణ్, సర్పంచ్ ద్యానబోయిన ఎల్లవ్వ, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ యాగ ఫలితమే జలకళ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆయత చండీయాగమే ఈనాటి జలకళకు కారణమని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎగువమానేరు ప్రాజెక్టును శనివారం వారు సందర్శించి మాట్లాడారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కలకుంట్ల గోపాల్‌రావు, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జెడ్పీటీసీలు తోట ఆగయ్య, జనగామ శరత్‌రావు, సెస్ డైరెక్టర్ విజయరమణరావు, ఏఎంసీ చైర్మన్ అందె సుభాస్ తదితరులు ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు. మార్గండి..గిద్దచెరువులకు గండి.. ఎల్లారెడ్డిపేట : మద్దిమల్ల మార్గండి, నారాయణపూర్ జక్కుల, ఎల్లారెడ్డిపేట గిద్దెచెరువులకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గండ్లు పడ్డాయి. అధికారులు అప్రమత్తమై చెరువుల వద్ద రైతులతో కలిసి గండ్లను పూడ్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మానేరు వాగు పొంగిపొర్లుతోంది. వెంకటాపూర్, బండలింగంపల్లి వద్ద మానేరు వరద ఉధృతిని ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తిలకించారు. మరిమడ్ల రహదారిలో వాగులు పొంగిపొర్లడంతో ఉదయం నుంచి ఈ రూటు గుండా రాకపోకలు స్తంభించాయి. వర్షం ధాటికి ఎల్లారెడ్డిపేటలో సుమారు 10ఇళ్లు నేలమట్టమయ్యాయి.