మానేరు పరవళ్లు
మానేరు పరవళ్లు
Published Sat, Sep 24 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్ : మానేరువాగు పరవళ్లు తొక్కింది. ఎగువ మానేరు నిండుకుండలా నిండి మత్తడి దూకుతోంది. 2012లో పారిన మానేరువాగుకు ఇప్పుడు జలకళ వచ్చింది. ఉదయం నుంచే వరద ప్రవాహం పెరిగింది. దీంతో జనం పులకించిపోయారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని వాగులో గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఆమె వెంట కౌన్సిలర్ దార్నం అరుణ ఉన్నారు. సిరిసిల్ల హిందూ ఉత్సవ సమితి, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నదీ స్వాగత్ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేపూరి శ్రీనివాస్, మేర్గు సత్యం, నాగుల సంతోష్‌గౌడ్, చిట్నేని సంజీవరావు, శివప్రసాద్, కౌన్సిలర్ వెల్ముల స్వరూపారెడ్డి, మాజీ కౌన్సిలర్ చేపూరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మానేరు వంతెన, మడేళేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి మానేరు ప్రవాహాన్ని పట్టణవాసులు తిలకించి పులకించిపోయారు.
సిరిసిల్ల ‘కొత్త’ చెరువుకు బుంగ
పట్టణ శివారులోని కొత్తచెరువు తూము వద్ద బుంగ పడింది. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన కొత్త చెరువుకు బుంగపడడంతో నీరు వృథాగా పోతోంది. చెరువుకు గండిపడే ప్రమాదం ఉందని శాంతినగర్ వాసులు భయాందోళనలు నెలకొన్నాయి. బుంగను కట్టడి చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు శ్రమించారు. కానీ ఫలించలేదు. ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించారు. చెరువుకు గండి పడకుండా, బుంగను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరదనీటిలో కార్మికవాడలు
సిరిసిల్ల రూరల్ : ముష్టిపల్లి పరిధిలోని రాజీవ్‌నగర్‌లో కార్మికవాడ వర్షపునీట మునిగింది. 13 ఇళ్లు వర్షపునీటిలో చిక్కుకున్నాయి. ఈదుల చెరువు నిండి మత్తడి పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వాసం శ్రీహరి అనే నేత కార్మికుడి ఇంటి చుట్టూ వర్షపు నీరు చేరి బయటకు రాకుండా తయారైంది. తంగళ్లపల్లి వద్ద మానేరులో ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. సర్పంచ్ కోడి సునీత, ఎంపీటీసీలు అంకారపు అనిత, పడిగెల మానస, నాయకులు పడిగెల రాజు, కోడి అంతయ్య, అంకారపు రవీందర్ పాల్గొన్నారు. జిల్లెల్లలో బర్ల సుశీలతోపాటు, అంకిరెడ్డిపల్లిలో మూడు, రాళ్లుపేటలో రెండు, లక్ష్మీపూర్‌లో ఒక ఇల్లు వర్షం ధాటికి ధ్వంసమయ్యాయి. పిడుగుపాటుకు చంద్రంపేటలో గేదె మృతి చెందింది. గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఎల్లవ్వకు గాయాలయ్యాయి. సుమారు రూ.4లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యూత్ నాయకుడు ప్రభుదాస్ తెలిపారు.
పొంగి పొర్లుతున్న వాగులు..వంకలు
గంభీరావుపేట : ఏకధాటి వర్షం..రహదారులు జలమయం..నీట మునిగిన పంట పొలాలు..అలుగు పోస్తున్న చెరువులు, కుంటలు..పొంగి పొర్లుతున్న వాగులు.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలో నీటి వనరులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు పారడంతో బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. మల్లారెడ్డిపేట, కోరుట్లపేట, నర్మాల, కోళ్లమద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మానేరు వాగు ఉధృతిలో గంధ్యాడపు రాజేశం అనే రైతుకు చెందిన సుమారు రూ. లక్ష విలువ గల రెండు ఎడ్లు మృతి చెందాయి. కరెంటు మోటార్లు, వ్యవసాయ పనిముట్లు నీటి ప్రవహాంలో కొట్టుకుపోయాయి. వర్షాలకు లింగన్నపేట, గంభీరావుపేటలో పలువురి ఇళ్లు కూలిపోయాయి.
గంగమ్మ తల్లీ..సల్లంగ సూడమ్మా
ఈసందర్భంగా ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ నర్మాల ఎగువమానేరు తీరాన మా‘నీటి’కి పూజలు నిర్వహించారు. ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ కొమిరిశెట్టి లక్ష్మణ్, సర్పంచ్ ద్యానబోయిన ఎల్లవ్వ, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ యాగ ఫలితమే జలకళ
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆయత చండీయాగమే ఈనాటి జలకళకు కారణమని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎగువమానేరు ప్రాజెక్టును శనివారం వారు సందర్శించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కలకుంట్ల గోపాల్‌రావు, ఎంపీపీ కమ్మరి గంగసాయవ్వ, జెడ్పీటీసీలు తోట ఆగయ్య, జనగామ శరత్‌రావు, సెస్ డైరెక్టర్ విజయరమణరావు, ఏఎంసీ చైర్మన్ అందె సుభాస్ తదితరులు ప్రాజెక్టును సందర్శించిన వారిలో ఉన్నారు.
మార్గండి..గిద్దచెరువులకు గండి..
ఎల్లారెడ్డిపేట : మద్దిమల్ల మార్గండి, నారాయణపూర్ జక్కుల, ఎల్లారెడ్డిపేట గిద్దెచెరువులకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గండ్లు పడ్డాయి. అధికారులు అప్రమత్తమై చెరువుల వద్ద రైతులతో కలిసి గండ్లను పూడ్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మానేరు వాగు పొంగిపొర్లుతోంది. వెంకటాపూర్, బండలింగంపల్లి వద్ద మానేరు వరద ఉధృతిని ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తిలకించారు. మరిమడ్ల రహదారిలో వాగులు పొంగిపొర్లడంతో ఉదయం నుంచి ఈ రూటు గుండా రాకపోకలు స్తంభించాయి. వర్షం ధాటికి ఎల్లారెడ్డిపేటలో సుమారు 10ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Advertisement