ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కొత్తకోట రూరల్:
రెండు నియోజక వర్గాలను కలిపే అప్పరాల- తిప్పడంపల్లి గ్రామాల మధ్య వంతెన లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా వాగుపై వంతెన నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇస్తున్నారే తప్ప శాశ్విత పనులు చేపట్టిన దాఖలాలు లేవు. రామన్‌పాడ్ ప్రాజెక్టు నుంచి వాగులోకి నీరు ప్రవహిస్తుంది. గతంలో కొందరు ప్రమాదాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పైపులు వేసి తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేశారు కానీ నీటిప్రవాహ ఉధ్రుతికి కొట్టుకుపోయింది.
అప్పటి నుంచి ఆయా ప్రాంతాల ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారు. అప్పరాల, రామకిష్టాపురం, పామాపురం తదితర గ్రామాల ప్రజలు ఆత్మకూరుకు వెళ్లాలంటే కొత్తకోట మీదుగా సుమారు 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ వంతెన నిర్మిస్తే సుమారు 10 కిలోమీటర్లలోపే ఆత్మకూరుతో పాటు శ్రీరామ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆయా గ్రామాల మధ్య వంతెనను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.