
మల్లన్నా దారెటు..?
♦ వివాదాస్పదంగా భూసేకరణ అంశం
♦ గగ్గోలు పెడుతున్న బాధితులు
♦ సర్కార్‌పై ప్రతిపక్షాల ముప్పేట దాడి
♦ దీటుగా స్పందిస్తున్న అధికార పక్షం
కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూసేకరణ అంశం గందరగోళంగా మారింది. భూములు గుంజుకుంటున్నారని, ఊరంతా ఖాళీ చేయాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. భూములు, ఊరిని వదిలితే బతుకుదెరువు ఏమిటని బెంగపెట్టుకున్నారు. ఇన్నేళ్లు ఉన్న బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి పక్షాన ఉద్యమిస్తున్నారు. ఇదిలావుంటే దేశంలోనే నంబర్ వన్ ప్యాకేజీ ప్రకటించా మని సర్కార్ దీటుగా జవాబిస్తోంది. భూ బాధితులు, ప్రతిపక్షాలు ఒకవైపు.. సర్కార్ మరోవైపు అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. రాజకీయ రంగు పులుమునుకున్న మల్లన్న సాగర్ అంశం ఎలా కొలిక్కివస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద 1.5 టీఎంసీల సామర్థ్యంతో దుబ్బాక-గజ్వేల్ నియోజకవర్గాల మధ్య మల్లన్నసాగర్‌ను నిర్మించడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. జిల్లాకు ఒక్క ఘణపురం ఆనకట్ట తప్ప మరో సాగునీటి ప్రాజెక్టు లేకపోవడంతో సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదన చేశారు. దీంతో ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్ చేసేందుకు నిర్ణయించారు. 21 వేల ఎకరాల్లో 52 టీఎంసీల నీళ్లు నిల్వ చేసే రిజర్వాయర్‌ను తొగుట-కొండపాక మండలాల మధ్య నిర్మించవచ్చని వాస్కోప్ సంస్థ ఇచ్చిన నివేదికతో తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణానికి పూనుకుంది.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో నిర్మితమవుతున్న రిజర్వాయర్, పైప్‌లైన్లు మొదలగు వాటి కోసం మొత్తం గ్రామాల్లో 20,079.16 ఎకరాల భూమి సేకరించడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో 5 గ్రామాల్లో పూర్తిగా ఇళ్లు, భూములు ముంపునకు గురవుతున్నాయి. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించడానికి ముంపు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు కూడా నిర్వహించారు. భూ సేకరణ కోసం జూలై 30న జీఓ 123ను జారీ అయ్యింది. దీనిలో స్వల్ప మార్పులు చేస్తూ జీఓ 214 ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం పాత జీఓలోని.. పునరావసం, మరో చోట నివాసానికి చెల్లింపు.. తదితర పదాలను ప్రభుత్వం తొలగించింది.
ముంపు బాధితుల డిమాండ్లు
♦ ఎకరానికి మార్కెట్ ధర మీద కనీసం నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలి.
♦ మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలి
♦ భూమికి భూమి, ఇంటికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి
♦ ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి.
దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు సాగు నీరందించడానికి చేపడుతోన్న 52 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈక్రమంలో 20,079.16 ఎకరాలను సేకరించే పని మొదలైంది. ముంపునకు గురవుతున్న ఊళ్లు, ఎకరాలు, ఇళ్ల వివరాలు...
♦ పైప్‌లైన్ల నిర్మాణానికి తుక్కాపూర్‌లో 972.10 ఎకరాలు, తొగుట, బ్రాహ్మణ బంజేరుపల్లిలో 2,703 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 142.30 ఎకరాల భూమి పోతోంది.
♦ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం పల్లెపహాడ్ రెవెన్యూ పరిధిలో 1,199 ఎకరాలు, 320 ఇళ్లు, దస్తగిరి నగరంలో 162 ఇళ్లు కోల్పోతున్నారు. తిప్పారంలో 2,344.1 ఎకరాలు, 250 ఇళ్లు, మదిర గ్రామమైన సింగారంలో 120 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి.
♦ ఎర్రవల్లిలో 2,297 ఎకరాలు 348 ఇళ్లు, మంగోల్‌లో 1851.36 ఎకరాలు 450 ఇళ్లు, కాశీ గుడిసెలులో 20 ఇళ్లు, కోనాయిపల్లిలో 444 ఎకరాలు 105 ఇళ్లు, వడ్డెర కాలనీలో 15 ఇళ్లు కోల్పోతున్నారు. మాత్‌పల్లి గ్రామంలో 44 ఎకరాలు, మేదినీపూర్‌లో 117 ఎకరాలు, ముద్దారం గ్రామంలో 40.19 ఎకరాల సాగు భూమి పైప్‌లైన్ల నిర్మాణం కోసం సేకరిస్తున్నారు.
జీఓనా... చట్టమా..?
123 జీఓ అంటే మ్యూచివల్ కాన్‌సెంట్ అవార్డు. రైతు ఒప్పుకుంటేనే వారితో ప్రభుత్వం ఒప్పదం చేసుకునే జీవో ఇది. 123 ప్రకారం ఎకరానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. బోరు, చెట్టు, బావి, పైప్‌లైన్లు ఇలా ఉన్నవాటికి కూడా అదనంగా నష్టపరిహారం కట్టిస్తారు. ఈ లెక్కన సగటున ఒక్కో ఎకరానికి రూ.7.5 నుంచి రూ.8 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. ఈ డబ్బు కూడా రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేసిన 15 నుంచి 20 రోజుల్లోనే అవకాశం ఉంది. ఇళ్లు కోల్పోతున్న వారికి రూ. 5.4 లక్షల నష్టపరిహారంతో(డబుల్ బెడ్‌రూంకు అయ్యే ఖర్చు) పాటు, కొత్త ఇళ్లు కట్టుకోవడానికి మరో రూ.5.4 లక్షల ఆర్థిక సహకారం అందిస్తారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువకు రెండింతలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మరో నిబంధన ప్రకారం ముంపునకు గురై, భూములు పోగొట్టుకున్నవారికి దానికి సమానమైన భూములు ఇవ్వాలనే నిబంధన ఉంది. నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి 6 నుంచి 8 నెలల సమయం తీసుకునే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని గతంలో సింగూరు ప్రాజెక్టు కింద రైతులకు అమలు చేశారు. ఈక్రమంలో పుల్కల్, అందోల్ మండలాల్లో 24 గ్రామాల్లో రైతులు భూములు కోల్పోయారు. కానీ, రైతులకు చేతికి ఇప్పటి వరకు డబ్బులు అందలేదు.
మల్లన్న సాగర్‌తో లాభాలు
మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. మల్లన్న సాగర్ నుంచి విడుదలయ్యే నీటితో మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టిన చెరువులను నింపుతారు. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి. బీళ్లుగా మారిన భూములు సాగులోకి వస్తాయి. దీంతో ప్రతి ఒక్కరికి చేతి నిండా పని దొరుకుతుంది. వర్షాధార పంటల అవసరమే ఉండదు. ఏడాదిలో రెండు పంటలకు సరిపోయేంత సాగు నీరందిస్తోంది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. రైతులకు అదనపు ఖర్చులు తగ్గుతాయి. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు, కోరికలను ప్రభుత్వం తీరిస్తే మల్లన్న సాగర్ రిజార్వాయర్‌తో నష్టం కన్నా లాభాలే అధికంగా ఉంటాయని మేథావుల అభిప్రాయం.
ముంపు బాధితుల కష్టాలు
20,079.16 వేల ఎకరాల సాగుకు అనుకూలమైన సారవంతమైన భూమిని రైతులు కోల్పోతున్నారు. 3,112 ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. ఇళ్లను ఎక్కడ నిర్మించుకోవాలో? ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో? ఎక్కడ సాగు భూములను కొనుగోలు చేసుకోవాలో? తెలియని ఆందోళన ముంపు గ్రామాల ప్రజల్లో నెలకొంది. బాధితుల బతుకులే చిందర వందరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.
నా దగ్గర మంచి స్కీం ఉంది: సీఎం కేసీఆర్
‘ప్రతి నియోజకవర్గానికి 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తాం. రిజర్వాయర్‌లో సాగు భూములు, ఇళ్లను కోల్పోతున్నవారు ఆధైర్య పడొద్దు. పోయినదానికంటే రూపాయి ఎక్కువే ఇస్తా. మీరు ఏం చేయాలో.. నా దగ్గర మంచి స్కీం ఉంది. నా దగ్గరకు మీరు వంద... నూటయాభై మంది కలిసి రండి. మీరు ఎక్కడెక్కడ భూములు కొనుక్కోవాలో చెప్తా.’ జనవరి 11న దుబ్బాకలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ అన్న మాటలివి.