ఈడ్చేశారు | people fight aginast tundurru factory | Sakshi
Sakshi News home page

ఈడ్చేశారు

Published Mon, Mar 27 2017 10:53 PM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM

ఈడ్చేశారు - Sakshi

ఈడ్చేశారు

వ్యాన్లలోకి విసిరేశారు
 తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నల గరువు గ్రామాల్లో సర్కారు దాష్టీకం
 ఆందోళనకారులపై పిడిగుద్దులు కురిపించిన పోలీసులు
 మహిళల్ని బూటుకాళ్లతో తన్ని లాఠీలు ఝళిపించిన ఖాకీలు
 ఆక్వా పార్క్‌ను ముట్టడించాలనే ప్రయత్నానికి అడ్డుకట్ట
 వందమందికి పైగా నిరసనకారుల అరెస్ట్‌
 
భీమవరం/భీమవరం అర్బన్‌/నరసాపురం రూరల్‌ :
గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ ప్రభావిత గ్రామాలైన తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు రణరంగంగా మారాయి. భారీగా తరలివచ్చిన పోలీసులతో సోమవారం అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. ఆక్వా పార్క్‌ను ముట్టడించేందుకు సమాయత్తమైన పోరాట కమిటీ, సీపీఎం నాయకులతోపాటు ఆ గ్రామాల ప్రజలపైనా పోలీసులు విరుచుకుపడ్డారు. నాయకులతోపాటు మహిళలను, వృద్ధులను సైతం ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్క్‌ వల్ల తీవ్రస్థాయిలో కాలుష్యం వెదజల్లుతుందని, దీనివల్ల పంటలు, పర్యావరణంతోపాటు ప్రజారోగ్యం దెబ్బతింటాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం విదితమే. ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలని, ఫ్యాక్టరీ ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ నెలకొల్పాలని భీమవరం, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు మూడేళ్లగా కోరుతున్నారు. అక్కడ ఆక్వా పార్క్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు పోరాట కమిటీ పెద్దఎత్తున ఉద్యమిస్తోంది. వారికి సీపీఎం, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీస్‌ యంత్రాంగాన్ని వినియోగిస్తూ వేధింపులు, లాఠీచార్జి, అరెస్ట్‌లు భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా.. ఉద్యమ తీవ్రత పెరుగుతోందే తప్ప ఆ ప్రాంత ప్రజలు వెనుకడుగు వేయడం లేదు. ఇందులో భాగంగానే ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తుందుర్రు, కంసాలి బేతపూడి, జొన్నలగరువు గ్రామాల్లో ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయించుకోగా వేలాదిమంది పోలీసులు మోహరించి ఉద్యమకారులతోపాటు మహిళలు, గర్భిణులు, వృద్ధులను సైతం పోలీసులు దమనకాండకు దిగి అరెస్ట్‌ చేశారు. ఇందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలు వెల్లువెత్తాయి. అనంతరం మానవ హక్కుల వేదిక నాయకురాలు విమల, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకుడు బి.రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిజనిర్థారణ బృందం ఆక్వా పార్క్‌ ప్రభావిత గ్రామాల్లో పర్యటించింది. ఆక్వా పార్క్‌ వల్ల తీవ్ర అనర్థాలు ఏర్పడతాయని, తక్షణం పనులు నిలిపివేసి వేరే ప్రాంతాలనికి తరలించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోరాట కమిటీ, సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఫుడ్‌పార్క్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. సీపీఎం నాయకులు ముందుగానే తుందుర్రు చేరుకుని కార్యాచరణ రూపొందించారు.
భారీగా మోహరించిన పోలీసులు
 విషయం పోలీసులకు తెలియడంతో ఆదివారం రాత్రికే ఆయా గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేసి బయటి ప్రాంతాల నుంచి తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల నుంచి ఏడుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, వందలాది మంది పోలీస్‌ కానిస్టేబుల్స్‌ పోరాట కమిటీ నాయకుల కోసం జల్లెడ పట్టారు. వారి జాడ తెలియకపోవడంతో నిఘా కొనసాగించారు. సోమవారం ఉదయం కంసాలి బేతపూడిలో మహిళలు, పోరాట కమిటీ నాయకులు రోడ్డుపైకొచ్చి ఆక్వా పార్క్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని చుట్టుముట్టి రోడ్లుపై ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లలోకి విసిరేశారు. వారందరినీ మొగల్తూరు, నరసాపురం స్టేషన్లకు తరలించారు. అనంతరం తుందుర్రులో లేసుపార్కు వద్దకు ఒక్కసారిగా ఆందోళనకారులు రావడంతో సీపీఎం, పోరాటకమిటీ నాయకులు వారితో జతకలసి ఆక్వా పార్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీపీఎం నాయకులు బి.బలరామ్, జేఎన్‌వీ గోపాలన్, ఐద్యా నాయకురాలు డి.కల్యాణి, పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, జవ్వాది వెంకటరమణ, ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి సత్యవతి, జవ్వాది సత్యనారాయణ తదితర 100 మందిని అరెస్ట్‌ చేశారు. భయాందోళనకు గురైన ప్రజలు, పిల్లలు, వృద్ధులు ఇళ్లల్లోంచి బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. 
 
పిడిగుద్దుల వర్షం
ఉద్యమకారులను అరెస్ట్‌ చేసే నెపంతో రోడ్లవెంట ఈడ్చుకెళ్లిన పోలీసులు వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కె.బేతపూడి రామాలయం వీధినుంచి పంచాయతీ కార్యాలయం రోడ్డుపైకి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు, ఐద్వా నాయకురాలు పొగాకు పూర్ణ తదితరులతోపాటు గ్రామంలోని మహిళలు  సైతం ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లు చేతులూ పట్టుకుని గాల్లోకి ఎగరేసిట్టుగా వాహనాల్లోకి విసిరేశారు. మహిళల్ని సైతం బూటు కాళ్లతో తన్నుతూ లాఠీలు ఝళిపించారు. పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ పని చేసింది నిజమైన పోలీసులు కాదని.. ఖాకీ దుస్తుల్లో వచ్చిన రౌడీలు ఈ దాష్టీకానికి దిగారని పలువురు మహిళలు ఆరోపించారు. 
 
ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు
గ్రామాల్లో ఎక్కడికక్కడ పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఆక్వా పార్క్‌ యాజమాన్యం పురమాయించిన 10 మంది వ్యక్తులు మూడు గ్రామాల్లోను ప్రతి వ్యక్తిని ఫొటో, వీడియోలు తీశారు. ఎవరైనా నోరెత్తితే కేసులు పెట్టి జైళ్లలో బంధిస్తామంటూ బెదిరించారు.  ఆదివారం రాత్రి నుంచే పోరాట కమిటీ నాయకుల కోసం గ్రామాల్లో జల్లెడ పట్టిన పోలీసులు కవురు పెద్దిరాజు, మామిడిశెట్టి రామాంజనేయులును అరెస్ట్‌ చేశారు. గ్రామాల్లో 144 సెక‌్షన్‌తోపాటు పోలీస్‌ యాక్ట్‌ 30 అమలులో ఉన్నాయంటూ ఆటోలకు మైక్‌లు కట్టి ప్రచారం చేశారు. ఎక్కడైనా ఇద్దరు, ముగ్గురు కనబడితే లాఠీలకు పనిచెప్పి బెదిరించారు. ప్రతి ఇంటికి ఇద్దరు చొప్పున పోలీసులను కాపలాగా పెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement