బీచుపల్లి ప్రధాన పుష్కరఘాట్ వద్ద పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం రిజర్వాయర్‌కు పరుగులు తీస్తున్న కృష్ణానది
పుష్కల స్నానం
Published Sat, Aug 6 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
–పుష్కరఘాట్లకు జలకళ
–నిండుకుండలా జూరాల జలాశయం
–నారాయణపూర్ నుంచి భారీగా వరద
–జిల్లాలో ప్రధాన జలాశయాలకు జలకళ
–14గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటివిడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఆల్మటి, నారాయణపూర్, జూరాలను దాటి శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. నిన్నమొన్నటి వరకు బోసిపోయిన పుష్కరఘాట్లు జలకళను సంతరించుకున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వరుణుడు కరుణ కురిపించాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రప్రథమంగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు కొత్త శోభ తీసుకొచ్చాడు.. జిల్లాలో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు వారంరోజుల ముందే జిల్లాకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఘాట్లకు చాలినన్ని నీళ్లురాకపోతే స్నానాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని భావించారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక పుష్కరస్నానాలకు ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 8.377టీఎంసీల నీరు నిల్వ ఉంది. 14గేట్ల ద్వార 2.63 లక్షల క్కూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
దిగువకు వరద ఉధృతి
జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీటిని గురువారం జూరాలకు విడుదల చేశారు. శుక్రవారం నారాయణపూర్ ఎగువ ప్రాంతంలో భారీ వరదలు వస్తుండడంతో జూరాలకు మరో లక్ష క్యూసెక్కుల నీటి వదిలిపెట్టారు. దీనికి అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులు జూరాల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉండకుండా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52పుష్కరఘాట్లలో కొన్ని మినహా అన్నికూడా పూర్తిస్థాయి నీటిమట్టంతో భక్తులు పుష్కరస్నానాలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించి పుణ్యస్నానం ఆచరించే అలంపూర్ మండలం గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో నీళ్లు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోలేదు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు మళ్లాల్సి ఉండడంతో ఈనెల 10వ తేదీ వరకు గొందిమళ్ల ఘాట్‌కు నీళ్లొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పుష్కరఘాట్లకు జలకళ
ఇప్పటికే మక్తల్, గద్వాల, వనపర్తి నియోజకరవర్గాల్లోని అన్ని ఘాట్లు, బీచుపల్లి ప్రధాన పుష్కరఘాట్‌లోకి పూర్తిస్థాయికి నీళ్లు చేరుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని ఘాట్లకు కృష్ణమ్మ వరద రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో మరో వీఐపీ ఘాట్ సోమశిలకు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు రావాల్సి ఉంది. సామర్థ్యానికి అనుగుణంగా జలాశయం నిండకపోవడంతో ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కృష్ణా పుష్కరాలకు జిల్లాలో రూ.250కోట్లతో అన్ని ఏర్పాట్లుచేసిన అధికారులు పుష్కర స్నానానికి నీటికొరత తీర్చడం ఎలాగని కొంత ఆందోళనకు గురయ్యారు. కృష్ణానదికి పుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
Advertisement