డీఏ పెంపు లేనట్లే!
♦ దీపావళికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ
♦ ఫైలును పెండింగ్‌లో పెట్టేందుకు సర్కారు నిర్ణయం
♦ ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశం
♦ నాలుగు నెలలుగా పీఆర్సీ బకాయిల ఊసే లేదు
♦ చెల్లింపుల విధానంపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ ముందు ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే మిగలనుంది. రేపో మాపో కరువు భత్యం (డీఏ) పెంపు ఉత్తర్వులు వస్తాయన్న ఉద్యోగుల ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం గండికొట్టింది. ఈ ఫైలును కొద్దిరోజుల పాటు పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితిని బట్టి డీఏ పెంపును కొంతకాలం వాయిదా వేయాలనే యోచనతో.. ఆర్థిక శాఖ ఈ ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు భత్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం డీఏను చెల్లించాల్సి ఉంది. ఏటా కేంద్రం జనవరి, జూలై నెలల్లో ఉద్యోగులకు డీఏను ప్రకటిస్తుంది.
అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. కేంద్రం జూలై డీఏ సెప్టెంబర్ 23న పెంచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ పెంపుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే ప్రకటన ఎప్పుడు వెలువడినా.. పెరిగిన డీఏ జూలై నుంచి వర్తిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని డీఏ పెంపు ఉత్తర్వులను నాలుగైదు నెలలు ఆలస్యంగా ఇస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పెరిగిన డీఏ ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ సెప్టెంబర్ 23న జారీ చేసింది. జూలై నుంచి పెరగాల్సిన డీఏ ఉత్తర్వులను ఇంకా విడుదల చేయలేదు. దీపావళి కానుకగా డీఏ పెంచితే డిసెంబర్ ఒకటో తేదీన అందుకునే జీతం పెరిగిన డీఏతో కలిపి అందుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. కానీ ఆర్థిక పరిస్థితి కుదుటపడే దాకా వేచి చూడాలనే ధోరణిని సర్కారు కనబరుస్తోంది. దీంతో మరో నెలా, రెండు నెలలు ఆలస్యంగా డీఏ పెంపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి.
బకాయిలపైనా దాటవేత!
ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలపైనా ప్రభుత్వం స్పందించడం లేదు. పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2014 జూన్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి 2015 మార్చి వరకు తొమ్మిది నెలలకుగాను సుమారు రూ.2,500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు భారీగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లింపును వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే బకాయిలను నగదుగా ఇవ్వాలా, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా? అన్న సందిగ్ధత ఇప్పటికీ వీడకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోంది.
సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ఆర్థిక శాఖ మొగ్గు చూపుతోంది. కానీ 2004 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేవు. వారితో పాటు పెన్షన్‌దారులకు జీపీఎఫ్ వర్తించదు. పెన్షన్‌దారులకు నగదు ముట్టజెప్పినా... జీపీఎఫ్ ఖాతాల్లేని ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై పీటముడి పడింది. వీరి పేరిట కొత్తగా జీపీఎఫ్ ఖాతాలు తెరిచే ప్రతిపాదన ఆచరణ సాధ్యంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త ఖాతాలు తెరవాలంటే అకౌంటెంట్ జనరల్ అనుమతి తీసుకోవాలి. దీంతో బకాయిల చెల్లింపు మొత్తం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పరిధిలోకి చేరుతుంది. అందుకే జీపీఎఫ్ ఖాతాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కొత్త ఉద్యోగుల పేరిట ప్రత్యామ్నాయ ఖాతాలు తెరిచే ఆలోచనపై కసరత్తు చేస్తున్నారు. అప్పటివరకు బకాయిల చెల్లింపు పెండింగ్‌లోనే ఉంటుందని స్పష్టమవుతోంది.