రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Mon, Jan 9 2017 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
– మృతదేహంతో రోడ్డుపై బైఠాయింపు
– గంటపాటు రాకపోకల అంతరాయం
చాగలమర్రి: స్థానిక రిక్వెస్టు స్టాప్ వద్ద పాత జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత ఎస్సీ కాలనీకి చెందిన సుబ్బరాయుడు (35) మృతి చెందాడు. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన సంజీవరాయుడుకు స్థానిక పాత ఎస్సీ కాలనీకి చెందిన రాణితో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. నాటి నుంచి చాగలమర్రిలోనే ఓ డాబాలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం డాబాలో పని ముగించుకొని ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తూ రిక్వెస్టు స్టాప్ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనాన్ని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడుకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రోడ్డుపై బైఠాయింపు
ప్రమాద విషయం తెలుసుకొని స్కార్పియో యజమాని మునిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాన్ని పక్కకు తీయించేందుకు ప్రయత్నించారు. దీంతో దళిత నాయకులు వేణుగోపాల్, గడ్డా ప్రకాష్, మాణిక్యమ్మ, సంజీవరాయుడు, ఓబులేసులు బాధితుడికి న్యాయం చేయాలని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. వాహన డ్రైవర్, ఓనర్‌పై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని జాతీయ రహదారి పై మృతదేహంతో బైఠాయించారు. గంట పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకొన్న ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు సంఘటనా స్ధలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వారితో హామినిచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డకు తరలించారు.
Advertisement