సాయం చేస్తే.. ప్రాణం పోయింది
అప్పు తీసుకున్న వ్యక్తి కాల్‌మనీ కేసు పెడతామని బెదిరింపు
మనోవేదనకుగురై గుండెపోటుతో మరణించిన అప్పు ఇచ్చిన వ్యక్తి
తన భర్త మృతికి అప్పు తీసుకున్న వ్యక్తే కారణమని భార్య ఫిర్యాదు
తిరుపతి: వ్యాపారం చేస్తాను అని మిత్రుడు కోరగా.. ఆ మిత్రుడికి అప్పు ఇచ్చిన పాపానికి ప్రాణాలే కోల్పోయాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పాల వ్యాపారి. అప్పు తిరిగి చెల్లించమని కోరితే.. 'ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించవద్దన్నాడు. ఎక్కువ మాట్లాడితే కాల్‌మనీ కేసు పెడతాను' అని అప్పు తీసుకున్న వ్యక్తి బెదిరించడంతో గుండెపోటుతో మరణించాడు పాల వ్యాపారి సుబ్రహ్మణ్యం యాదవ్.
దీనిపై సుబ్రహ్మణ్యం భార్య సోమవారం ముత్యాలరెడ్డిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పు తీసుకున్న కరుణాకర్‌రెడ్డి బెదిరించడంతో తన భర్త గుండెపోటుతో చనిపోయాడని తిరుపతి రూరల్ మండలం మల్లంగుంటకు చెందిన నిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మల్లంగుంటకు చెందిన పొట్టేలు సుబ్రహ్మణ్యంయాదవ్ పాల వ్యాపారం చేస్తుండేవాడు. సి.గొల్లపల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి పాల వ్యాపారం చేస్తామని కొంతకాలం క్రితం మల్లంగుంటలో సుబ్రహ్మణ్యంయాదవ్‌కు చెందిన పొలాన్ని లీజుకు తీసుకున్నాడు. అక్కడ డెయిరీ ప్రారంభించాడు. ఇద్దరికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యంయాదవ్ తన బంధువులు, స్నేహితులు తీసుకున్న డబ్బుతో పాటు తన వద్ద ఉన్న డబ్బు కలిపి మొత్తం రూ.15.40 లక్షలను కరుణాకర్‌రెడ్డికి వడ్డీకి ఇచ్చాడు.
మూడేళ్లయినా అతను తిరిగి చెల్లించలేదు. వడ్డీ కూడా ఇవ్వలేదు. ఒక పక్క బంధువులు ఒత్తిడి, మరో పక్క బిడ్డల చదువులకు ఫీజులు చెల్లించాల్సి ఉండడంతో సుబ్రహ్మణ్యం శనివారం గొల్లపల్లికి వెళ్లి కరుణాకర్‌రెడ్డిని డబ్బులు అడిగాడు. అప్పులు చెల్లించవద్దు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, తాను ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఎక్కువగా మాట్లాడితే కాల్‌మనీ కేసు పెడతామని బెదిరించాడు. దీంతో సుబ్రహ్మణ్యంయాదవ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీసుకున్న డబ్బు చెల్లించకుండా తన భర్తను బెదిరించి ఆయన చావుకు కారణమైన కరుణాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిర్మల పోలీసులను కోరారు.