‘పోలీసుల తీరుతోనే మా బిడ్డ ఆత్మహత్య’
⇒ గొళ్లగూడెంలో బాధితుల ఆందోళన
⇒ సర్దిచెప్పి అంత్యక్రియలు జరిపించిన డీఎస్పీ
ములకలపల్లి: గొళ్లగూడెం గ్రామంలో సాయి అనే వ్యక్తి గురువారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు చేయని నేరాన్ని తన కొడుకుపై మోపి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి తల్లిదండ్రులు, కుటుం బ సభ్యులు ఆరోపించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..నాలుగు రోజుల క్రితం మండల పరిధిలోని రాజుపేటలో జరిగిన రూ.2లక్షల దొంగతనం విషయమై..సాయిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్ర ఇబ్బంది పెట్టారని, తాళలేక ఇంటికి వచ్చాక ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసుల తీరు మారాలని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని కోరుతూ అంత్యక్రియలు నిర్వహించకుండా ఆపారు. గ్రామస్తులు కూడా వీరికి సానుభూతి ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయమే గ్రామానికి చేరుకొని సాయి అంత్యక్రియలు జరపాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ..ఆందోళన ఆగలేదు. పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ షుకూర్ గ్రామానికి చేరుకొని..సాయికి ఈ కేసుతో సంబంధం ఉందా..? లేదా..? విచారణ చేసి తేలుస్తామని, పోలీసులు ఇబ్బంది పెట్టి ఉంటే.. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కుటుంబ సభ్యులు సాయి అంత్యక్రియలు నిర్వహించారు.