
ప్రత్యేకహోదా కోసం విద్యార్థి ఆత్మహత్యాయత్నం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా.. తిరుపతిలో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న మాసుమయ్య అనే విద్యార్థి గత నాలుగు రోజులుగా ప్రత్యేక హోదా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నాడు. సోమవారం కూడా విద్యార్థులు తరగతులను బహిష్కరించి.. ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ఇదే సందర్భంలో మాసుమయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సమయానికి తోటి విద్యార్థులు అతడిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్ద ఎత్తున అతడి ఒంటిపై పెట్రోలు పడినా.. సమయానికి విద్యార్థులు చూడటంతో మాసమయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. గతంలో ప్రత్యేక హోదా కోసం మునుకోటి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా వైఎస్ జగన్ స్పష్టంగా ఒకటే చెప్పారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని, పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ భావోద్వేగంతో మాసుమయ్య లాంటివాళ్లు ఇలా చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
రైల్వే కోడూరు రూరల్: జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేకహోదా కోసం సోమవారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా రంగమ్మ అనే మహిళా కార్యకర్త సూపర్ వాస్మాల్ అనే ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కార్యకర్తలు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.