రెచ్చిపోతున్న జేబుదొంగలు
రెచ్చిపోతున్న జేబుదొంగలు
Published Sun, Aug 14 2016 9:15 PM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
ఘాట్ల వద్ద అధికారులకు దొంగల బెడద
సాక్షి, అమరావతి :
పుష్కరాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పన్నెండేళ్లకు వచ్చే పవిత్ర కృష్ణా పుష్కరాల్లో దొంగలు మాటు వేశారు. ఘాట్ల వద్ద యాత్రికులు స్నానాల హడావుడిలో ఉండగా ఏమార్చి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధాన స్నానపు ఘాట్లతో పుష్కర నగర్‌లను అడ్డాగా మార్చుకున్నారు. ఓవైపు పోలీసు వర్గాలు దొంగల కదలికలపై నిఘా ఉంచినా వారి దూకుడుకి కళ్లెం వేయలేకపోతున్నారు. జేబుదొంగలతో పాటు దోపిడీ ముఠాలు మాటు వేసి చోరీలకు పాల్పడుతున్నారు.
14 ఏళ్ల బాలురే అధికం..
ప్రస్తుతం చోరీలకు పాల్పడతున్న ముఠాల్లో ఎక్కువగా 14 సంవత్సరాలోపు బాలురే అధికంగా ఉన్నారు. ర ద్దీ ఉన్న స్నానఘాట్లలో సామాన్య భక్తుల్లా కలిసిపోయి తమ చేతికి పని కల్పిస్తున్నారు. వేషాలు మార్చి పిండప్రదానం చేసే అర్చకుల్లానూ వస్తున్నారు. నిరంతరం పోలీసు నిఘా ఉన్న చోరీలు మాత్రం ఆగటం లేదు.
బెజవాడలో తిష్టవేసిన దొంగలు..
నగరానికి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దొంగల ముఠా వచ్చి చేరినట్లు సమాచారం. వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరి కాలనీ, కేథరేశ్వర పేట ఏరియాల్లో దొంగల ముఠా మాటు వేసినట్లు తెలుస్తోంది. 20కి పైగా గ్యాంగ్‌లు తిష్టవేసినట్లు వినికిడి. ప్రధాన ఘాట్లలో ర ద్దీ ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వీరు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఇప్పటికే వంద మందిని అదుపులోకి తీసుకున్నారు.
అధికారులకు తప్పని దొంగల బెడద
ప్రధాన ఘాట్లో విధి నిర్వహణలో ఉన్న అధికారులకు దొంగల బెడద తప్పటం లేదు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సబ్ కలెక్టర్ సుజన సెల్‌ఫోన్ కూడా దొంగలు అపహరించారు. పుష్కరాల్లో అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని పోలీస్ అధికారులు ముందు నుంచి చెబుతున్నారు. వేలమంది పోలీసులను రంగంలోకి దింపారు. ఎక్కడ లేని ఆంక్షలు పెట్టి భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిఘానీడ ఉన్నా దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు. ప్రతి ఘాటులో జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెట్టారు. కానీ వారి దూకుడుకు మాత్రం కళ్లెం వేయలేక వైఫల్యం చెందారనే ఆరోపణలున్నాయి. నిత్యం పోలీస్ కంట్రోలు రూం నుంచి 1300 వందల సీసీ కెమెరాలతో ప్రతి ఘాటును పర్యవేక్షణ చేస్తున్నారు. దొంగల పని పట్టడంతో ఎందుకు వైఫల్యం చెందారో పోలీసులకే తెలియాలి.
Advertisement