devotees problems
-
ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం
జోషిమఠ్: ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిత్రోగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో దాదాపుగా 300 మంది చిక్కుకుపోయారు. లిపులేఖ్–తవాఘాట్ రోడ్డులో అతి పెద్ద కొండ చరియ విరిగి పడడంతో దాదాపుగా 100 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ధరాచులా, గంజి ప్రాంతంలో 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్టు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ రోడ్డుకి మరమ్మతులు నిర్వహించి తిరిగి రాకపోకలు సాగించడానికి మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిత్రోగఢ్, రుద్రప్రయాగ, తెహ్రిగర్వాల్, ఉధామ్‌సింగ్ నగర్, ఉత్తర కాశీ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చార్దామ్ యాత్రలో ఉన్న భక్తులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని మరో రెండు మూడు రోజుల పాటు ప్రయాణాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు. -
నీళ్లు లేవు.. నీడ లేదు
సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి దేవస్థానంలో వసతుల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై మంచినీటి వసతి లేదు, ఆలయం లోపల ఉక్కపోత.. వెలుపల నిలువ నీడలేక ఎండకు భక్తులు అల్లాడిపోతున్నారు. నేరుగా కొండపైకి చేరుకునే వీలులేక ఆర్టీసీ బస్సుల్లో కిలోమీటర్ల దూరం కొండచుట్టూ ప్రయాణించడంతో సమయం వృథా అవుతోంది. కొండపైకి చేరుకున్న తర్వాత క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్లు దాటుకుని స్వామి దర్శనం చేసుకున్నాక ప్రసాద విక్రయశాల వరకు సుమారు 2 కిలోమీటర్లు తిప్పుతున్నారు. భక్తులు అధికంగా వచ్చే శుక్ర, శని, ఆదివారాలతో పాటు, కొద్ది సంఖ్యలో వచ్చే మంగళ, బుధవారాల్లో కూడా ఈ దూరాభారం తప్పడం లేదు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు లేవు. ఇక మూత్ర శాలలు, మరుగు దొడ్లు అలంకార ప్రాయంగా ఉన్నాయి. క్యూలైన్ ఎస్కలేటర్లు, చలువ పందిళ్ల జాడలేదు. క్యూలైన్లలో దక్షిణ ప్రాకారం వద్ద చిరిగిన పాత టెంట్ వేయగా, ప్రథమ ప్రాకారం నుంచి గుడిలోకి వెళ్లే చోట భక్తులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు బయటకు రాగానే కనీసం సేదదీరడానికి నీడ కూడా లేదు. ఆలయం వెలుపలి బండలు ఎండకు మండుతున్నాయి. కాళ్లు కాలుతుండడంతో భక్తులు పరుగులు తీస్తున్నారు. కొండ కింద సుమారు మూడు కిలో మీటర్లు వెళ్లే వరకు ఎక్కడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దర్శనం అనంతరం స్వామి వారి అన్న ప్రసాద వితరణ జరిగే దీక్షాపరుల మండపం వరకు బస్సు సౌకర్యం లేదు. కొండపైన, కొండకింద దుకాణాలు లేకపోవడంతో పూజా సామాగ్రి ఎక్కడ కొనాలో తెలియని పరిస్థితి నెలకొంది. భక్తుల తికమక.. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన భక్తుడు సంతోశ్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి దర్శనానికి వచ్చారు. కొండకింద తులసీ కాటేజీ వద్ద కారు నిలిపారు. అక్కడి నుంచి కొండపైకి వెళ్లాలనుకుంటే కల్యాణ కట్టవద్ద ఉచిత దర్శనం టికెట్ తీసుకోవాలని పోలీసులు చెప్పి వెనక్కి పంపారు. ఆన్లైన్ కౌంటర్లో టికెట్ తీసుకుని మళ్లీ బస్సు ఎక్కి కొండపైకి వెళ్లారు. దీంతో సుమారు గంట సమయం వృథా అయ్యిందని సంతోశ్ ‘సాక్షి’తో చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళతా యాదాద్రి దేవాలయంలో భక్తుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతా. నేను కూడా స్వామి దర్శనానికి వచ్చా. క్యూలైన్లలో భక్తులతో మాట్లాడితే ఇబ్బందులు చెప్పారు. ఆలయ నిర్మాణమే తప్పుగా జరిగింది. భక్తుల కంటే స్వామివారు దిగువన ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు గర్భాలయంలోకి ప్రవేశించే పరిస్థితి లేదు. భక్తులకు కొండపైన కనీస వసతులు లేవు. ప్రైవేట్ వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులకు తగిన వసతులు కల్పించాలి. – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ వసతులు కల్పించాలి –– పాశం భాస్కర్, భువనగిరి యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం మంచినీరు, వాష్‌రూంలు, నీడకోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. దర్శనం అనంతరం ఆలయంనుంచి బయటకువచ్చే భక్తులు రెండు నిముషాలు ఆలయ ప్రాంగణంలో కూర్చునే వీలులేదు. ఉచిత టోకెన్లకు ఇబ్బందే.. శ్రీస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఉచిత టోకెన్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జియో ట్యాగింగ్ పేరిట అరగంటకు పైగా సీఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లి క్యూకట్టాలి. టోకెన్ తెస్తేనే కొండపైన దర్శనం అని అధికారులు చెబుతున్నారు. టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్తే.. ఎవరు కూడా టోకెన్‌ను చూడటం లేదు. కొండపైన క్యూకాంప్లెక్స్‌లో టోకెన్ చెక్ చేయనప్పుడు.. జియో ట్యాగింగ్ ఎందుకు? – స్వప్న, తార్నాక -
తిరుమలలో సర్వర్ డౌన్.. భక్తుల ఇక్కట్లు
సాక్షి, తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి తిరుమలలో శనివారం కంప్యూటర్లు మొరాయించాయి. దీంతో గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయంలో గంటకుపైగా కంప్యూటర్లు పని చేయలేదు. సర్వర్ డౌన్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులు కోసం గంటల తరబడి క్యూలైన్లో పడిగాపులు గాస్తున్నారు. కంప్యూటర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు. -
సత్యదేవుడి సన్నిధిలో భక్తుల ఇక్కట్లు
అన్నవరం : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అన్నవరంలో కొలువైన రమా సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి. సత్యదేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఎండలో నిల్చున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న మహిళలు, వృద్ధులు తాగు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కొండపైకి సొంత వాహనాలకు నో!
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ నియంత్రణకు దుర్గగుడి అధికారులు చర్యలు చేపట్టారు. వీఐపీలు, సొంత వాహనాలపై కొండపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఓం టర్నింగ్ వద్ద పలు మార్లు ట్రాఫిక్ నిలిచిపోతోంది. కార్లపై కొండపైకి వచ్చే వారి కోసం దేవస్థానం టోల్‌గేటు వద్ద రూ. 300 టికెటు కౌంటర్ ఏర్పాటు చేయడంతో పాటు వారిని కొండపైకి తరలించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. భక్తులు తమ వాహనాలను కెనాల్ రోడ్డు, కమాండ్ కంట్రోల్ రూమ్ , హెడ్ వాటర్ వర్కు్స పరిసరాలలో నిలుపుకుని టోల్‌గేటుకు చేరుతున్నారు. టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లో టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక వాహనంపై కొండపైకి చేరుకున్నారు. లడ్డు ఇవ్వలేదని ఫిర్యాదులు శనివారం ఉదయం 10–30 గంటల వరకు రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించకపోవడంతో టెంపుల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవో సీసీకి చేరవేయగా, టికెట్‌తో పాటు లడ్డు అందజేయాలని సంబం«ధిత అధికారులను ఆదేశించారు. -
పచ్చనేత చెప్పాడని..
ఇంద్రకీలాద్రి: అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు వేచి ఉండే క్యూలైన్లను దేవస్థాన సిబ్బంది శనివారం తొలగించారు. అర్జున వీధిలోని శృంగేరీమఠంలో నిత్యం అమ్మవారి అన్న ప్రసాదాన్ని భక్తులకు అందచేస్తుంటారు. అయితే పుష్కరాల తరుణంలో అర్జున వీధి విస్తరణ, మహా ప్రాకారం రోడ్డును దేవస్థానం చేపట్టింది. అర్జునవీధి వెడల్పు తగ్గిపోవడంతో స్థానికంగా ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధి కారు రాకపోకలకు ఆటంకమని భక్తుల సౌకర్యానికి గండికొట్టారు. దసరా, భవానీ దీక్షల సమయంలో అమ్మవారి అన్న ప్రసాదం కోసం భక్తులు, భవానీలు క్యూలైన్లో వేచి ఉండేవారు. భక్తులు అన్న ప్రసాదం కోసం గోశాల, రాజస్థానీ స్కూల్ వరకు బారులు తీరి ఉండేవారు. అదే వీధిలో ఉంటున్న టీడీపీ ప్రజా ప్రతినిధికి ఇది కంటగింపుగా మారింది. తరచూ భక్తులకు సదుపాయాలే ప్రధానం అని చెప్పే ఆ ప్రజాప్రతినిధి తమ వంతు వచ్చే సరికి తన సౌకర్యమే ప్రధానమంటూ అప్పట్లోనే దుర్గగుడి అధికారులపై చిందులు తొక్కేవారు. కారుకు ఇబ్బందట తాజాగా అర్జునవీధి విస్తరణ చేపట్టి మహా ప్రాకారం నిర్మాణం చేయడంతో సదరు ప్రజాప్రతినిధి ఇంటికి కారు వచ్చేందుకు ఇబ్బందికరంగా మారింది. అర్జునవీధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూలైన్లు తొలగించాలని ఆయన దుర్గగుడి అధికారులకు హుకుంఇచ్చారు. దుర్గగుడి అధికారులు అతను చెప్పినట్లుగానే క్యూలైన్లు తొలగించేశారు. బాగా ఉన్న క్యూలైన్లను ఎందుకు తొలగిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. మరో వైపు శృంగేరీ మఠానికి ఎదురుగా ఉన్న చిన్నపాటి స్థలంలోనే క్యూలైన్లు నిర్మించి అధికారులు తమ పని అయిందనిపించారు. రానున్న దసరా ఉత్సవాలలో నిత్యం పది వేల మందికి దేవస్థానం అన్న ప్రసాదం పంపిణీ చేయాల్సి ఉంది. అంతమంది భక్తులకు కొత్త క్యూలైన్ ఎంతమాత్రం సరిపోదు. -
రెచ్చిపోతున్న జేబుదొంగలు
ఘాట్ల వద్ద అధికారులకు దొంగల బెడద సాక్షి, అమరావతి : పుష్కరాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పన్నెండేళ్లకు వచ్చే పవిత్ర కృష్ణా పుష్కరాల్లో దొంగలు మాటు వేశారు. ఘాట్ల వద్ద యాత్రికులు స్నానాల హడావుడిలో ఉండగా ఏమార్చి చోరీలకు పాల్పడుతున్నారు. ప్రధాన స్నానపు ఘాట్లతో పుష్కర నగర్లను అడ్డాగా మార్చుకున్నారు. ఓవైపు పోలీసు వర్గాలు దొంగల కదలికలపై నిఘా ఉంచినా వారి దూకుడుకి కళ్లెం వేయలేకపోతున్నారు. జేబుదొంగలతో పాటు దోపిడీ ముఠాలు మాటు వేసి చోరీలకు పాల్పడుతున్నారు. 14 ఏళ్ల బాలురే అధికం.. ప్రస్తుతం చోరీలకు పాల్పడతున్న ముఠాల్లో ఎక్కువగా 14 సంవత్సరాలోపు బాలురే అధికంగా ఉన్నారు. ర ద్దీ ఉన్న స్నానఘాట్లలో సామాన్య భక్తుల్లా కలిసిపోయి తమ చేతికి పని కల్పిస్తున్నారు. వేషాలు మార్చి పిండప్రదానం చేసే అర్చకుల్లానూ వస్తున్నారు. నిరంతరం పోలీసు నిఘా ఉన్న చోరీలు మాత్రం ఆగటం లేదు. బెజవాడలో తిష్టవేసిన దొంగలు.. నగరానికి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దొంగల ముఠా వచ్చి చేరినట్లు సమాచారం. వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరి కాలనీ, కేథరేశ్వర పేట ఏరియాల్లో దొంగల ముఠా మాటు వేసినట్లు తెలుస్తోంది. 20కి పైగా గ్యాంగ్‌లు తిష్టవేసినట్లు వినికిడి. ప్రధాన ఘాట్లలో ర ద్దీ ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వీరు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఇప్పటికే వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. అధికారులకు తప్పని దొంగల బెడద ప్రధాన ఘాట్‌లో విధి నిర్వహణలో ఉన్న అధికారులకు దొంగల బెడద తప్పటం లేదు. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న సబ్ కలెక్టర్ సుజన సెల్‌ఫోన్ కూడా దొంగలు అపహరించారు. పుష్కరాల్లో అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని పోలీస్ అధికారులు ముందు నుంచి చెబుతున్నారు. వేలమంది పోలీసులను రంగంలోకి దింపారు. ఎక్కడ లేని ఆంక్షలు పెట్టి భక్తులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. నిఘానీడ ఉన్నా దొంగతనాలను అరికట్టలేకపోతున్నారు. ప్రతి ఘాటులో జేబు దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డులు పెట్టారు. కానీ వారి దూకుడుకు మాత్రం కళ్లెం వేయలేక వైఫల్యం చెందారనే ఆరోపణలున్నాయి. నిత్యం పోలీస్ కంట్రోలు రూం నుంచి 1300 వందల సీసీ కెమెరాలతో ప్రతి ఘాటును పర్యవేక్షణ చేస్తున్నారు. దొంగల పని పట్టడంతో ఎందుకు వైఫల్యం చెందారో పోలీసులకే తెలియాలి. -
అమ్మ సన్నిధిలో అగచాట్లు
విజయవాడ : కష్టాలు తీర్చమ్మా.. కనకదుర్గమ్మా.. అంటూ వచ్చే భక్తులకు అమ్మ సన్నిధిలోనూ కష్టాలు తప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దయినా కొద్దిసేపు సేదతీరే అవకాశం లేకపోగా, ఎంతసేపైనా నిలబడే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దవుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు కనీసం ఆ పరిసరాల్లో కూడా అధికారులు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. చేసేదేమీలేక అమ్మపైనే భారం వేసి వర్షంలోనే తడుస్తూ క్యూలైన్‌కు చేరుకుంటున్నారు. కొండ కిందా ఇదే పరిస్థితి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తొలుత కనకదుర్గానగర్‌లో బస్సుల కోసం వేచి చూస్తూ వర్షంలో తడుస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌లోని క్యూలైన్‌కు చేరాలన్నా ఎలాంటి షెడ్డూ లేదు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు రాజగోపురం నుంచి బయటకు రావాలన్నా వర్షంలో తడుస్తూ రావాల్సిందే. అధికారులూ.. స్పందించండి రానున్నది వర్షాకాలం కావడంతో ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడే స్పందించకుంటే కృష్ణా పుష్కరాలు, దసరా ఉత్సవాల సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. -
సుదర్శనంలో ఇక్కట్లు
శ్రీకాకుళం సిటీ: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొనేందుకు ముందుగానే భక్తులు ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్వామి వారి ఆర్జిత సేవలతో పాటు, గదులు, సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని తిరుపతి పయనమవుతారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగా టోకెన్లు వేసుకునేందుకు, గదులు బుక్ చేసుకునేందుకు భక్తుల సౌకర్యార్థం సుదర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సుదర్శన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత నెల రోజుల్లో పట్టుమని 10 రోజులు కూడా ఈ కౌంటర్ పనిచేసిన దాఖలాలు లేవని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు ఈ కౌంటర్లోనే అన్ని రకాల ఆర్జిత సేవలను పొందేవారు. పోస్టాఫీస్ల్లో కూడా రూ. 300 స్వామివారి టిక్కట్లు ఇస్తున్నప్పటికీ ఎక్కువగా ఈ-సుదర్శన్ కౌంటర్‌పైనే భక్తులు ఆధారపడుతున్నారు. ఈ కౌంటర్లో కంప్యూటర్‌కు గత నెల రోజులుగా గ్రహణం పట్టింది. ఎప్పుడు పనిచేస్తుందో... ఎప్పుడు పనిచేయదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కంప్యూటర్లో సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలో ఏ పార్టు పనిచేయకపోయినా ముందుగా తిరుపతికి సమాచారాన్ని అందించాలి. ఇక్కడి పరిస్థితిపై పూర్తిగా ఇండెంట్ పెడితే గాని ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఇదిలావుండగా ఈ నెలలో తిరుపతిలో జరగనున్న స్వామివారి వార్షిక బ్రహోత్సవాల నేపథ్యంలో ఇక్కడి ఈ-సుదర్శన్ కౌంటర్‌కు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అయితే కంప్యూటర్ మోరాయిస్తుండడంతో ఎక్కడెక్కడి నుంచో స్వామి వారి ఆర్జిత సేవల కోసం ఇక్కడికి వ స్తున్న భక్తులకు చేదు అనుభవం తప్పడం లేదు. టీటీడీ సేవలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఇక్కడ నిరీక్షించినా ఫలితం ఉండడం లేదని భక్తులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ-సుదర్శన్ కౌంటర్ పరిస్థితిపై తెలుసుకుందామంటే అక్కడ ఉన్న ఫోన్ కూడా పనిచేయడంలేదని అంటున్నారు. అధికారులు తక్షణం స్పందించాలని భక్తులు కోరుతున్నారు. -
తిరుమలలో నీటి సమస్య... భక్తుల అవస్థలు
-
శ్రీవారి భక్తులకు ఆర్టీసీ సమ్మె కష్టాలు
సాక్షి, తిరుమల:ఆర్టీసీ సమ్మెతో తిరుమలలో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల డిపోకు సంబంధించి 110 బస్సులుండగా సమ్మె కారణంగా బుధవారం 43 బస్సులు మాత్రమే తిరిగాయి. సాధారణంగా సమ్మెలో ఉన్నా సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతి డిపోలకు మినహాయింపు ఇస్తారు. అయితే, తాజా సమ్మెలో ఎన్ఎంయూ తప్ప మిగిలిన యూనియన్నన్నీ పాల్గొన్నాయి. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండులో పడిగాపులు పడ్డారు. దీనివల్ల ఆర్టీసీకి రోజూ లభించే రూ.17 లక్షలకు బదులు కేవలం రూ.4 లక్షల్లోపే ఆదాయం లభించింది. ఇక బయట డిపోల నుంచి నిత్యం వచ్చే మరో 350 బస్సు సర్వీసులు కూడా ఆగిపోయాయి. మరోవైపు ప్రైవేట్ ట్యాక్సీలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయటంతో భక్తుల జేబులకు చిల్లుబడుతోంది. -
భక్తులకు సౌకర్యాలా.. 108 ఇంచుల టీవీలా?
వరుసగా రెండు రోజులు సెలవలు వస్తే చాలు.. తిరుమల కిటకిట. క్యూలైన్లలో కనీసం నిల్చోడానికి కూడా సరిపడ స్థలం ఉండదు. పోనీ, భక్తుల రద్దీని నియంత్రించలేకపోయినా మధ్యమధ్యలో కనీసం మజ్జిగ నీళ్లయినా ఇస్తే భక్తులకు కాస్త నిలబడే ఓపిక అయినా వస్తుంది. రూ. 300 టికెట్ పెట్టి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటారే గానీ, దానికి కూడా కనీసం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పడుతున్న పరిస్థితి. తిరుమలలో భక్తులకు ఇన్ని ఇబ్బందులున్నా, టీటీడీ పాలకమండలి సభ్యులకు మాత్రం అవేవీ కనిపించలేదు. (చదవండి: వైకుంఠం క్యూకాంప్లెక్సులలో 108 అంగుళాల టీవీలు) వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1లో ఉన్న 32 కంపార్టుమెంట్లలో ఒక్కోదాంట్లో 108 అంగుళాల టీవీలు పెట్టాలని మాత్రం తోచింది. ఇందుకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ కంపార్టుమెంట్లలోకి రావడానికి ముందు, ఆ తర్వాత కూడా బోలెడంత దూరం భక్తులు నిలువు కాళ్ల మీద నిల్చోవాల్సి ఉంటుంది. చాలాచోట్ల కనీసం గాలి కూడా ఆడదు. అలాంటిచోట్ల ఫ్యాన్లు ఏర్పాటుచేయాలన్న ఆలోచన కూడా పాలకమండలికి గానీ, అధికారులకు గానీ రాలేదు. గతంలో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు మధ్యమధ్యలో మజ్జిగ, ఏదో ఒక ఆహారం ప్యాకెట్లు ఇచ్చేవారు. కానీ గత కొంత కాలంగా అదికూడా లేదు. కేవలం మొట్టమొదట ఉండే క్యూలో మాత్రమే మంచినీళ్లు, అప్పుడప్పుడు ఉప్మా లాంటివి ఇస్తున్నారు. వేసవి సెలవలు అయిపోతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి ప్రధాన ఆలయానికి వెళ్లేలోపే ఆ భగవంతుడు కళ్లెదుటే కనిపిస్తున్నాడు. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా గాలి ఆడే పరిస్థితి కూడా ఉండదు. ఎక్కువ సేపు వేచి ఉంటే కూర్చోడానికి సదుపాయం ఉండదు. అలాగే, అసలు క్యూలైన్లలోకి ప్రవేశించడానికి ముందు దర్శనానికి ఎంత సమయం పట్టొచ్చన్న సమాచారం కూడా భక్తులకు అందదు. ఒకసారి క్యూలైన్లోకి వెళ్లిన తర్వాత మధ్యలో బయటకు రావడానికి వీలుండదు. మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలు ఉన్న భక్తుల పరిస్థితి వర్ణనాతీతం. క్యూలైన్లలోకి కొంతమంది అనధికారికంగా వచ్చి పది రూపాయల ఫ్రూటీ ప్యాకెట్‌ను ఇరవై రూపాయలకు, నాలుగు సన్నపాటి మామిడి బద్దలను పదిరూపాయలకు అమ్ముతుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు వాటినే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ పాలకమండలి సభ్యులకు, అధికారులకు తెలియనివేమీ కావు. చాలాసార్లు వాళ్ల దృష్టికి వెళ్లినా, తమ చేతిలో ఉండి.. పరిష్కరించగలిగే సమస్యలపై కూడా ఇంతవరకు పాలకమండలి దృష్టిపెట్టలేదు. మరికొన్నాళ్లలోనే టీటీడీ పాలకమండలి పదవీకాలం అయిపోతుండటంతో ఇప్పుడు హడావుడిగా పెద్దపెద్ద టీవీల కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. ఇప్పటికైనా పాలకమండలి సభ్యులు, అధికారులు ముందుగా భక్తుల సౌకర్యాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.