క్యూకాంప్లెక్స్‌లో ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న భక్తులు
సాక్షి, యాదాద్రి: మహోన్నత క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి దేవస్థానంలో వసతుల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండపై మంచినీటి వసతి లేదు, ఆలయం లోపల ఉక్కపోత.. వెలుపల నిలువ నీడలేక ఎండకు భక్తులు అల్లాడిపోతున్నారు. నేరుగా కొండపైకి చేరుకునే వీలులేక ఆర్టీసీ బస్సుల్లో కిలోమీటర్ల దూరం కొండచుట్టూ ప్రయాణించడంతో సమయం వృథా అవుతోంది. కొండపైకి చేరుకున్న తర్వాత క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్‌లు దాటుకుని స్వామి దర్శనం చేసుకున్నాక ప్రసాద విక్రయశాల వరకు సుమారు 2 కిలోమీటర్లు తిప్పుతున్నారు. భక్తులు అధికంగా వచ్చే శుక్ర, శని, ఆదివారాలతో పాటు, కొద్ది సంఖ్యలో వచ్చే మంగళ, బుధవారాల్లో కూడా ఈ దూరాభారం తప్పడం లేదు. క్యూకాంప్లెక్స్‌లో ఏసీలు, ఫ్యాన్లు లేవు.
ఇక మూత్ర శాలలు, మరుగు దొడ్లు అలంకార ప్రాయంగా ఉన్నాయి. క్యూలైన్ ఎస్కలేటర్లు, చలువ పందిళ్ల జాడలేదు. క్యూలైన్లలో దక్షిణ ప్రాకారం వద్ద చిరిగిన పాత టెంట్ వేయగా, ప్రథమ ప్రాకారం నుంచి గుడిలోకి వెళ్లే చోట భక్తులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. స్వామి దర్శనం తర్వాత భక్తులు బయటకు రాగానే కనీసం సేదదీరడానికి నీడ కూడా లేదు. ఆలయం వెలుపలి బండలు ఎండకు మండుతున్నాయి. కాళ్లు కాలుతుండడంతో భక్తులు పరుగులు తీస్తున్నారు. కొండ కింద సుమారు మూడు కిలో మీటర్లు వెళ్లే వరకు ఎక్కడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దర్శనం అనంతరం స్వామి వారి అన్న ప్రసాద వితరణ జరిగే దీక్షాపరుల మండపం వరకు బస్సు సౌకర్యం లేదు. కొండపైన, కొండకింద దుకాణాలు లేకపోవడంతో పూజా సామాగ్రి ఎక్కడ కొనాలో తెలియని పరిస్థితి నెలకొంది.
భక్తుల తికమక..
హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన భక్తుడు సంతోశ్ శనివారం తన కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి దర్శనానికి వచ్చారు. కొండకింద తులసీ కాటేజీ వద్ద కారు నిలిపారు. అక్కడి నుంచి కొండపైకి వెళ్లాలనుకుంటే కల్యాణ కట్టవద్ద ఉచిత దర్శనం టికెట్ తీసుకోవాలని పోలీసులు చెప్పి వెనక్కి పంపారు. ఆన్‌లైన్ కౌంటర్‌లో టికెట్ తీసుకుని మళ్లీ బస్సు ఎక్కి కొండపైకి వెళ్లారు. దీంతో సుమారు గంట సమయం వృథా అయ్యిందని సంతోశ్ ‘సాక్షి’తో చెప్పారు.
సీఎం దృష్టికి తీసుకెళతా
యాదాద్రి దేవాలయంలో భక్తుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతా. నేను కూడా స్వామి దర్శనానికి వచ్చా. క్యూలైన్లలో భక్తులతో మాట్లాడితే ఇబ్బందులు చెప్పారు. ఆలయ నిర్మాణమే తప్పుగా జరిగింది. భక్తుల కంటే స్వామివారు దిగువన ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు గర్భాలయంలోకి ప్రవేశించే పరిస్థితి లేదు. భక్తులకు కొండపైన కనీస వసతులు లేవు. ప్రైవేట్ వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తులకు తగిన వసతులు కల్పించాలి.
– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
వసతులు కల్పించాలి
–– పాశం భాస్కర్, భువనగిరి
యాదగిరిగుట్ట దేవస్థానంలో భక్తులకు కనీస వసతులు కల్పించాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. కనీసం మంచినీరు, వాష్‌రూంలు, నీడకోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. దర్శనం అనంతరం ఆలయంనుంచి బయటకువచ్చే భక్తులు రెండు నిముషాలు ఆలయ ప్రాంగణంలో కూర్చునే వీలులేదు.
ఉచిత టోకెన్లకు ఇబ్బందే..
శ్రీస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే ఉచిత టోకెన్ కౌంటర్ వద్ద ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జియో ట్యాగింగ్ పేరిట అరగంటకు పైగా సీఆర్‌వో కార్యాలయం వద్దకు వెళ్లి క్యూకట్టాలి. టోకెన్ తెస్తేనే కొండపైన దర్శనం అని అధికారులు చెబుతున్నారు. టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్తే.. ఎవరు కూడా టోకెన్‌ను చూడటం లేదు. కొండపైన క్యూకాంప్లెక్స్‌లో టోకెన్ చెక్ చేయనప్పుడు.. జియో ట్యాగింగ్ ఎందుకు?
– స్వప్న, తార్నాక
Comments
Please login to add a commentAdd a comment