పచ్చనేత చెప్పాడని..
పచ్చనేత చెప్పాడని..
Published Sat, Sep 10 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
ఇంద్రకీలాద్రి: అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు వేచి ఉండే క్యూలైన్లను దేవస్థాన సిబ్బంది శనివారం తొలగించారు. అర్జున వీధిలోని శృంగేరీమఠంలో నిత్యం అమ్మవారి అన్న ప్రసాదాన్ని భక్తులకు అందచేస్తుంటారు. అయితే పుష్కరాల తరుణంలో అర్జున వీధి విస్తరణ, మహా ప్రాకారం రోడ్డును దేవస్థానం చేపట్టింది. అర్జునవీధి వెడల్పు తగ్గిపోవడంతో స్థానికంగా ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధి కారు రాకపోకలకు ఆటంకమని భక్తుల సౌకర్యానికి గండికొట్టారు.
దసరా, భవానీ దీక్షల సమయంలో అమ్మవారి అన్న ప్రసాదం కోసం భక్తులు, భవానీలు క్యూలైన్‌లో వేచి ఉండేవారు. భక్తులు అన్న ప్రసాదం కోసం గోశాల, రాజస్థానీ స్కూల్ వరకు బారులు తీరి ఉండేవారు. అదే వీధిలో ఉంటున్న టీడీపీ ప్రజా ప్రతినిధికి ఇది కంటగింపుగా మారింది. తరచూ భక్తులకు సదుపాయాలే ప్రధానం అని చెప్పే ఆ ప్రజాప్రతినిధి తమ వంతు వచ్చే సరికి తన సౌకర్యమే ప్రధానమంటూ అప్పట్లోనే దుర్గగుడి అధికారులపై చిందులు తొక్కేవారు.
కారుకు ఇబ్బందట
తాజాగా అర్జునవీధి విస్తరణ చేపట్టి మహా ప్రాకారం నిర్మాణం చేయడంతో సదరు ప్రజాప్రతినిధి ఇంటికి కారు వచ్చేందుకు ఇబ్బందికరంగా మారింది. అర్జునవీధిలో దేవస్థానం ఏర్పాటు చేసిన క్యూలైన్లు తొలగించాలని ఆయన దుర్గగుడి అధికారులకు హుకుంఇచ్చారు. దుర్గగుడి అధికారులు అతను చెప్పినట్లుగానే క్యూలైన్లు తొలగించేశారు. బాగా ఉన్న క్యూలైన్లను ఎందుకు తొలగిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. మరో వైపు శృంగేరీ మఠానికి ఎదురుగా ఉన్న చిన్నపాటి స్థలంలోనే క్యూలైన్లు నిర్మించి అధికారులు తమ పని అయిందనిపించారు. రానున్న దసరా ఉత్సవాలలో నిత్యం పది వేల మందికి దేవస్థానం అన్న ప్రసాదం పంపిణీ చేయాల్సి ఉంది. అంతమంది భక్తులకు కొత్త క్యూలైన్ ఎంతమాత్రం సరిపోదు.
Advertisement
Advertisement