శ్రీవారి భక్తులకు ఆర్టీసీ సమ్మె కష్టాలు
సాక్షి, తిరుమల:ఆర్టీసీ సమ్మెతో తిరుమలలో భక్తులు అవస్థలు పడుతున్నారు. తిరుమల డిపోకు సంబంధించి 110 బస్సులుండగా సమ్మె కారణంగా బుధవారం 43 బస్సులు మాత్రమే తిరిగాయి. సాధారణంగా సమ్మెలో ఉన్నా సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతి డిపోలకు మినహాయింపు ఇస్తారు. అయితే, తాజా సమ్మెలో ఎన్‌ఎంయూ తప్ప మిగిలిన యూనియన్నన్నీ పాల్గొన్నాయి.
దీంతో బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండులో పడిగాపులు పడ్డారు. దీనివల్ల ఆర్టీసీకి రోజూ లభించే రూ.17 లక్షలకు బదులు కేవలం రూ.4 లక్షల్లోపే ఆదాయం లభించింది. ఇక బయట డిపోల నుంచి నిత్యం వచ్చే మరో 350 బస్సు సర్వీసులు కూడా ఆగిపోయాయి. మరోవైపు ప్రైవేట్ ట్యాక్సీలు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయటంతో భక్తుల జేబులకు చిల్లుబడుతోంది.