కొల్లాపూర్‌ను అగ్రస్థానంలో నిలుపుదాం
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్రంలోనే కొల్లాపూర్‌ను అగ్రస్థానంలో నిలపుదామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో రెండో విడత తెలంగాణ హరితహారంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి మండలానికి 8 లక్షల చొప్పున నియోజకవర్గంలో 40లక్షల మొక్కలు నాటేందుకు కృషిచేయాలన్నారు. ఈ సంవత్సరం రెండో విడతలో జిల్లాలో 4.53 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డీఆర్‌డీఏ, డ్వామా, మెప్మా, ఫారెస్ట్, పంచాయతీరాజ్ శాఖలంతా సమన్వయంతో కృషిచేసి అధిక మొత్తంలో మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలన్నారు.
రేపటి నుంచే గుంతలు తీయడానికి సమాయత్తం కావాలని, మొక్కలు నాటే కార్యక్రమం గ్రామాలో్ల పూర్తిగా ఫీల్డ్ అసిస్టెంట్లే బాధ్యత వహించాలన్నారు. ఏ గ్రామానికి మొక్కలు అందకున్నా వెంటనే మొబైల్ ద్వారా అధికారులకు మెసేజ్ పెట్టాలని సర్పంచ్‌లకు సూచించారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా బాధ్యతగా వ్యవహరించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హరితహారంలో వందశాతం మొక్కలు నాటిన గ్రామాలకు రూ.లక్ష, మండల స్థాయిలో ఎన్‌జీఓలు, కార్పొరేట్, ప్రభుత్వ, స్థానిక సంస్థలు మొక్కలు నాటి ప్రథమ స్థానంలో నిలిస్తే రూ.2 లక్షల వరకు ప్రభుత్వం బహుమతులు ఇస్తుందన్నారు.
సమావేశంలో డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్‌ఓ రామ్మూర్తి, డీఎఫ్‌ఓ బాలస్వామి, డీపీఓ వెంకటేశ్వర్లు, వనపర్తి ఆర్డీఓ రామచందర్, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, లావణ్య, జెడ్పీటీసీలు హన్మంతునాయక్, బస్తీరాంనాయక్, రవి, వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.