దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాప్తాడు మండలం పండమేరు వంక వద్ద తనపై దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు యల్లనూరుకు చెందిన బోయ ఓబులేసు డిమాండ్ చేశాడు. బుధవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. గత నెల 28న తనపై నగేష్‌చౌదరి దాడి చేసి గాయపరిచారని తెలిపాడు. 30వ తేదీ ఈ విషయంపై విచారణ చేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారన్నాడు. ఈ నెల ఒకటో తేదీన శ్రుతి తనపై తప్పుడు ఫిర్యాదు చేసి, అక్రమ కేసు బనాయించిందని ఆరోపించాడు.
2012లో తాను ఎంబీఏ, శ్రుతి ఎమ్మెస్సీ చదువుతున్నపుడు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారిమని చెప్పాడు. 2013లో మనస్పర్ధలు రావడంతో ఇద్దరం విడిపోయామని వివరించాడు. తమ వ్యవహారంపై పోలీస్ స్టేషన్‌లోనే ఎనిమిది కేసులు నడుస్తున్నాయని తెలిపాడు. శ్రుతి చెప్పడం వల్లే నగేష్‌చౌదరి, సుబ్బారెడ్డి, హరివిందరెడ్డి, మోహన్‌రెడ్డిలు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఓబులేసు వాపోయాడు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమ కేసులు బనాయించి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నాడు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నాడు. కార్యక్రమంలో రాప్తాడు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు, వాల్మీకి సేవా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కొండమ్మ, వాల్మీకి మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, శ్రీనివాసులు, సింగారప్ప తదితరులు పాల్గొన్నారు.