boya obulesu
-
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాప్తాడు మండలం పండమేరు వంక వద్ద తనపై దాడి చేసి గాయపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు యల్లనూరుకు చెందిన బోయ ఓబులేసు డిమాండ్ చేశాడు. బుధవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. గత నెల 28న తనపై నగేష్‌చౌదరి దాడి చేసి గాయపరిచారని తెలిపాడు. 30వ తేదీ ఈ విషయంపై విచారణ చేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారన్నాడు. ఈ నెల ఒకటో తేదీన శ్రుతి తనపై తప్పుడు ఫిర్యాదు చేసి, అక్రమ కేసు బనాయించిందని ఆరోపించాడు. 2012లో తాను ఎంబీఏ, శ్రుతి ఎమ్మెస్సీ చదువుతున్నపుడు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారిమని చెప్పాడు. 2013లో మనస్పర్ధలు రావడంతో ఇద్దరం విడిపోయామని వివరించాడు. తమ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లోనే ఎనిమిది కేసులు నడుస్తున్నాయని తెలిపాడు. శ్రుతి చెప్పడం వల్లే నగేష్‌చౌదరి, సుబ్బారెడ్డి, హరివిందరెడ్డి, మోహన్‌రెడ్డిలు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఓబులేసు వాపోయాడు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే తనపై అక్రమ కేసులు బనాయించి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నాడు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశానన్నాడు. కార్యక్రమంలో రాప్తాడు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు, వాల్మీకి సేవా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కొండమ్మ, వాల్మీకి మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, శ్రీనివాసులు, సింగారప్ప తదితరులు పాల్గొన్నారు. -
బోయ ఓబులేసు అరెస్ట్
తాడిపత్రి : పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చేతిలో తీవ్రంగా గాయపడిన బోయ ఓబులేసును బుధవారం పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నగేష్ కాబోయ భార్య శృతి తనను వేధించాడన్న ఫిర్యాదుతో పోలీసులు బోయ ఓబులేసుపై 294, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తాడిపత్రి కోర్టులో హాజరుపరిచినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
-
బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన నగేష్ చౌదరి కాబోయే భార్య శ్రుతి మంగళవారం ఓబులేసుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని చెప్పడం వల్లే నగేష్ చౌదరి దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఓబులేసుపై నాగేష్ చౌదరి దాడి చేసిన వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. గత అయిదు రోజులుగా ఓబులేసు ఆచూకీ కూడా లేదు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాగేష్ చౌదరి కాబోయే భార్య ఓబులేసుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేసు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బోయ ఓబులేసును నగేష్ చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, అతడి పుట్టినరోజుకు మంత్రి పరిటాల సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీ కేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు.