బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడులో బోయ ఓబులేసుపై దాడి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన నగేష్ చౌదరి కాబోయే భార్య శ్రుతి మంగళవారం ఓబులేసుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గత నాలుగేళ్లుగా ఓబులేసు వేధిస్తున్నాడని, ఆ విషయాన్ని చెప్పడం వల్లే నగేష్ చౌదరి దాడి చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఓబులేసుపై నాగేష్ చౌదరి దాడి చేసిన వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.
గత అయిదు రోజులుగా ఓబులేసు ఆచూకీ కూడా లేదు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలకు తావు ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాగేష్ చౌదరి కాబోయే భార్య ఓబులేసుపై ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేసు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు బోయ ఓబులేసును నగేష్ చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, అతడి పుట్టినరోజుకు మంత్రి పరిటాల సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీ కేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు.