రాప్తాడులో పరిటాల వర్గీయుల దాష్టీకం
అనంతపురం: రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడికి దిగారు. పరిటాల శ్రీరామ్ డ్రైవర్ నగేష్ చౌదరికి కాబోయే భార్యను వేధించాడని ఆరోపిస్తూ పరిటాల అనుచరులు ఓబులేష్ ని చుట్టుముట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు, స్థానికుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా అందరూ మౌనం వహించారు తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ, వెంకటాపురం తీసుకుపోతే నీకు బుద్ది వస్తుంది అని నగేష్ చౌదరి వ్యాఖ్యానించాడు. మంత్రి సునీత ఒత్తిడితో నామమాత్రంగా నగేష్ చౌదరిపై కేసు నమోదు చేశారు. రాప్తాడు సమీపంలోని ముళ్ల పొదల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం.
మరోవైపు ఆటవిక న్యాయం పై పరిటాల సునీత స్పందించారు. ఇలాంటి దౌర్జన్యాలను తాను ఎలాంటి సందర్భాల్లోనూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. నగేష్ చౌదరి తన అనుచరుడు కాదని తెలిపారు. నగేష్ చౌదరిని ఏడాది నుంచి తమకు దూరంగా ఉంచుతున్నామన్నారు. తన కొడుకు పరిటాల శ్రీరామ్కు నగేష్ చౌదరి డ్రైవర్ కాదని చెప్పారు.