‘అనంత’ లో కొనసాగుతున్న హైడ్రామా
అనంతపురం: అనంతపురం జిల్లాలో హైడ్రామా కొనసాగుతోంది. పరిటాల శ్రీరామ్ అనుచరుడు నగేష్ చౌదరీ రాప్తాడులో ఓబులేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన వీడియో బయటకు వచ్చి కలకలం రేపింది. అప్పటి నుంచి ఓబులేషు ఆచూకీ తెలియడం లేదు. అయితే పోలీసులు రహస్యంగా ఓబులేషుకు చికిత్స అందిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో నగేష్ చౌదరి, ఓబులేషు మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు యత్నిస్తున్నట్టు సమాచారం.
కాగా ఈ మొత్తం వ్యవహరం తీరును పలువురు తప్పుబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత ఒత్తిడి మేరకే ఓబులేషు పై హత్యాయత్నం జరిగిందని పౌరహక్కుల సంఘం నేత, లాయర్ హరినాథ్ రెడ్డి ఆరోపించారు. ఐదు రోజుల నుంచి ఓబులేషు ఆచూకీ లభించకపోయినా పోలీసులు కిడ్నాప్ వంటి కేసులు నమోదు చేయలేదన్నారు. అనంత పోలీసులు బ్రోకర్లలా వ్యవహరించడం బాధాకరమని ఆయన మండిపడ్డారు.