– అడ్డదారిలో పనులు చక్కబెట్టుకుంటున్న వైనం
– గోడదూకి కార్యాలయంలోకి వెళ్లిన ఏజెంట్ అనుచరుడు
– మరుసటి రోజు అడ్డుకున్న సెక్యూరిటీపై విచక్షణారహితంగా దాడి
అనంతపురం సెంట్రల్: మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు అనంతపురం రోడ్డు రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయంలో దందా చేస్తున్నారు. అనధికారికంగా కార్యాలయంలోకి ప్రవేశించి, పనులు చక్కబెట్టుకుంటున్నారు. అడ్డు వచ్చిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. రోడ్డు రవాణా శాఖలో అక్రమాలను నివారించేందుకు ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) సుందర్‌వద్దీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఏజెంట్లు, వారి అనుచరులు కార్యాలయంలోకి రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది డీటీసీ ఆదేశాలు గట్టిగా అమలు చేస్తున్నారు. కార్యాలయంలోకి వచ్చే వాహనదారులు ఏ పని మీద వస్తున్నారో రికార్డులను చూసి పంపిస్తున్నారు.
అయితే పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకొని ఏజెంట్ చోటూ ఇక్కడ దందా కొనసాగిస్తున్నారు. ఆయన మనుషులు నేరుగా కార్యాలయంలోకి చొరబడి అధికారులను బెదిరించి పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా గత బుధవారం ఏజెంట్ అనుచరుడు గోడదూకి ఫైళ్లు తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో మరుసటిరోజు సెక్యూరిటీ గార్డు పెద్దన్న వీరిపై నిఘా పెట్టాడు. కార్యాలయంలోకి వస్తుండడం చూసి అడ్డుకున్నాడు. చేసేది లేక సదరు వ్యక్తి జరిగిన విషయాన్ని ఏజెంట్‌కు తెలియజేశాడు.
కోపోద్రిక్తుడైన ఏజెంట్ చోటూ ఇద్దరు మనుషులను వెంటబెట్టుకొని నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వచ్చి సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు. ‘రేయ్ ఏమనుకుంటున్నావ్. పరిటాల శ్రీరామ్ మనుషులైన మమ్మల్నే అడ్డుకుంటావా’ అంటూ ఇష్టానుసారం చితకబాదాడు. దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీగార్డుపై ఇష్టానుసారం దాడి చేసిన ఏజెంట్‌పై ఎలాంటి చర్యలూ లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. బాధితుడు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ అనుచరుడు కావడంతో కేసు నమోదు చేయకుండా పోలీసుల తాత్సారం చేశారు.
అడ్డుకున్నందుకు దాడి చేశాడు : పెద్దన్న, సెక్యూరిటీగార్డు, బాధితుడు
ఏజెంట్లకు కార్యాలయంలోకి అనుమతించరాదని డీటీసీ, ఆర్టీఓ ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు రాకుండా అడ్డుకున్నాను. అంతకు మించి నాకేమీ తెలియదు. అంతకుముందు రోజు గోడదూకి పోయాడు. మళ్లీ గురువారం వస్తే అడ్డుకోవడంతో ఇష్టానుసారం చేయిచేసుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రాజీకావాలని చెబుతున్నారు.
ఆర్టీఏలో ‘శ్రీరామ్’ అనుచరుల దందా
Published Sat, Jul 22 2017 10:47 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM
Advertisement
Advertisement