అమ్మా... నన్నెలాగైనా బతికించండి
అందరిలా నేను బడికిపోతాను. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని, మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటాను అంటూ తొమ్మిదేళ్ల చిన్నారి నోటి వెంట వెలువడిన మాటలు విన్న ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇది నిత్యం కనిపిస్తున్న దృశ్యమే అయినా... చిన్నారి అభ్యర్థనకు తల్లిదండ్రుల కన్నీరే సమాధానమవుతోంది. పేదరికంతో మగ్గిపోతున్న నిరుపేద దళిత కుటుంబం దుస్థితి ఇది.
అంతు చిక్కని వ్యాధితో....
రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన హరిజన రామాంజినేయులు, కేశమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు, వీరిలో పెద్దమ్మాయి, చిన్న కొడుకు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే రెండవ అమ్మాయి రూప మాత్రం వింత జబ్బు బారిన పడింది. చిన్నప్పటి నుంచి హైపర్ ఇన్‌స్యూలినిమిక్, హైపర్ అమ్మోనియో సిండ్రోమ్ (శరీరంలో ఇన్స్‌లిన్, అమ్మోనియా శాతం ఎక్కువగా ఉండటం)తో సతమతమవుతున్న ఈ పాప శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గిపోయి కళ్లు తిరిగి పడిపోతోంది.
చికిత్సకు అడ్డుగా నిలుస్తున్న పేదరికం
రూప పుట్టిన వారం రోజుల్లోనే ఈ సమస్యను తల్లిదండ్రులు గుర్తించారు. ఏ రోజుకా రోజు కూలీ పనులు చేసుకుంటే తప్పా పూట గడవని స్థితిలో ఉన్న వారు, తమ ఆర్థిక స్థోమత మేరకు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రి, పుట్టపర్తిలోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో కొన్ని రోజుల పాటు బెంగళూరుకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోవడంతో ఖరీదైన వైద్యం చేయించలేక ఇంటిదారి పట్టారు. బెంగళూరులో డాక్టర్ చెప్పిన మందులు వాడుతున్నారు.
చక్కెరే భోజనం
రూప శరీరంలో గ్లూకోజ్ శాతం పెరగడానికి ప్రతి రోజూ అర కేజీ చక్కెరను తల్లిదండ్రులు తినిపిస్తున్నారు. చక్కెరతో పాటు బెంగళూరులో డాక్టర్ సూచించిన మందులకు ప్రతి నెలా రూ. 8వేలకు పైగా ఖర్చు వస్తోంది. మందులు సక్రమంగా వాడకపోయినా, క్రమం తప్పకుండా చక్కెర తినిపించకపోయినా రూప నిస్సత్తువగా నేలవాలిపోతుంది.
ధ్రువీకరణ పత్రం ఉన్నా... అందని పింఛన్
ప్రస్తుతం రూపకు తొమ్మిదేళ్లు. అయితే వింత జబ్బుతో బాధపడుతుండడం వల్ల శరీరం ఎదుగుదల లేక మూడేళ్ల పాపగానే ఉంది. పరీక్షించిన వైద్యులు రూపకు మానసిక వికలాంగురాలి కింద ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ పత్రం ద్వారా సామాజిక పింఛన్ కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. రూప పేరుమీద వచ్చే పింఛన్ డబ్బులు ఆ పాప చికిత్స కోసం కొద్దోగొప్పో ఉపయోగపడుతుందని వారు భావించారు. అయితే రూపకు పింఛన్ ఇవ్వలేమంటూ అధికారులు తేల్చిచెప్పారు.
చదువుకోవాలని ఉంది
తన తోటి పిల్లలు, అక్క, తమ్ముడుకిమల్లే తాను పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని రూప భావిస్తోంది. అయితే తన శరీరంలో ఉన్న జబ్బు ఇందుకు సహకరించడం లేదు. ప్రతిగంటకు 100 గ్రాముల చొప్పున చక్కెర తినకపోతే కళ్లు తిరిగి కిందపడిపోతుంది. దీంతో స్కూల్‌కు వెళుతున్న పిల్లల వైపు ఆశగా చూస్తు ‘అమ్మా నాకు చదువుకోవాలని ఉంది. నేనూ బడికిపోతాను’ అంటూ దైన్యంగా అడుగుతుంటే కన్నపేగు చలించిపోతోంది. ఆరోగ్యం బాగైన తర్వాత బడికి పోదువులేమ్మా అంటూ కన్నీళ్లతో బుజ్జగించడం మినహా ఆ నిరుపేద తల్లిదండ్రులు మరేమి చేయలేని అసహాస్థితిలో కుమిలిపోతున్నారు.
దాతలు దయతలిస్తే....
ఖరీదైన జబ్బుతో బాధపడుతున్న తమ చిన్నారికి చికిత్స చేయించలేని దుస్థితిలో ఉన్నామంటూ రూప తల్లిదండ్రులు హరిజన రామాంజినేయులు, కేశమ్మ కన్నీటితో తెలిపారు. అందరి పిల్లల్లా తాను కూడా స్కూల్‌కు వెళ్లాలని. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటానని అంటోందని అయితే ఆరోగ్యం బాగా లేకపోవడంతో కనీసం తన తోటి పిల్లలతో సైతం ఆడుకోలేక ఇబ్బంది పడుతోందని వివరించారు. ఇలాంటి పరిస్థితిలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ చిన్నారికి బతుకునివ్వాలని వారు కోరుతున్నారు.
అరుదైన వ్యాధి
‘సాధారణంగా మేనరిక వివాహం వల్ల ఇలాంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇతరుల్లో చాలా అరుదుగా ఈ వ్యాధి వస్తుంది. జన్యుపరమైన లోపాలే దీనికి కారణం. లక్షల్లో ఒకరికి వస్తుంది. ఇలాంటి జబ్బుకు సపోర్టివ్ ట్రీట్‌మెంట్ మాత్రమే మార్గం. వీలైనంతగా శరీరంలో గ్లూకోజ్ శాతం తగ్గకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో ఇబ్బంది కలుగుతుంటుంది. కనుక దానికి తగ్గట్టు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.’
- డాక్టర్ పొత్తం సతీష్ కుమార్,
ఎండోక్రైనాలజిస్ట్, సతీష్ ఎండోక్యూర్ హాస్పిటల్, అనంతపురం
దాతలు సంప్రదించాల్సిన చిరునామా
వి. రామాంజినేయులు, ముక్తాపురం,
ఎస్సీ కాలనీ, కనగానపల్లి మండలం,
అనంతపురం జిల్లా.
ఫోన్ : 9985939937
ఆర్థిక సాయం చేయదలిస్తే
బ్యాంక్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, మామిళ్లపల్లి శాఖ
ఖాతాదారుడి పేరు : వి. రామాంజినేయులు
ఖాతా నంబరు : 9101 787 7861
ఐఎఫ్‌సీఎస్ : ఎపిజిబి 00001085